బాపు, బాలచందర్, విశ్వనాధ్ లాంటి కళా దర్శకుల చిత్రాలలో నటించే అరుదైన అవకాశం పొందిన నేటితరం అగ్రనటుడు.!!

0
426

ఆ మధ్య కాలంలో ఈటీవీ లో ప్రసారమయ్యే స్వరాభిషేకం కార్యక్రమానికి కళా దర్శకులు బాపు,బాలచందర్, విశ్వనాధ్ హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం బాలసుబ్రహ్మణ్యం వేదికపైకి ఆ దర్శకత్రయాన్ని ఆహ్వానించి వినమ్రంగా సాష్టాంగ నమస్కారం చేసి.. తన సంస్కారాన్ని పదింతలు పెంచుకున్నారు. నిజంగా ఆ కళా దర్శకులకు అంతటి గౌరవాన్ని ఆపాదించి, ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నారు. నిజంగా ఈ అగ్ర దర్శకులు వారి చిత్రాలు సమాజంలోని ఆదర్శ సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచాయి. ఆ సంగీత సంప్రదాయాల చిత్రాలు భారత సాంస్కృతిక కీర్తి బావుటాను ఎగురవేశాయి.

నిజంగా వారి దర్శకత్వంలో నటిస్తే ఆ నటుల సినీప్రయాణంలో ఆ చిత్రాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి అదృష్టం సినీ పరిశ్రమలో కొందరికి మాత్రమే దక్కుతుంది. ఎన్టీ రామారావు.. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘నిండు హృదయాలు’ చిత్రంలో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు.. విశ్వనాధ్ దర్శకత్వంలో ఆత్మగౌరవం, సూత్రధారులు చిత్రంలో నటించారు. కృష్ణ.. విశ్వనాధ్ దర్శకత్వంలో ‘నేరంశిక్ష ‘చిత్రంలో నటించారు. ఎన్టీ రామారావు.. బాపు దర్శకత్వంలో ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ చిత్రంలో నటించగా, ఏఎన్ఆర్ బుద్ధిమంతుడు, అందాల రాముడు, కృష్ణ ‘సాక్షి’ చిత్రంలో నటించారు.

ఈ ముగ్గురు మరో కళా దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ బాపు, బాలచందర్, విశ్వనాథ్ వంటి కళా దర్శకుల చిత్రాలలో నటించే అరుదైన అవకాశం ఆ తరువాత వచ్చిన చిరంజీవి సొంతం చేసుకున్నారు. బాపు దర్శకత్వంలో “మన ఊరి పాండవులు, మంత్రిగారి వియ్యంకుడు చిత్రంలో చిరంజీవి నటించారు.

బాలచందర్ దర్శకత్వంలో ఇది కథ కాదు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, 47 రోజులు, రుద్రవీణ చిత్రంలో చిరంజీవి నటించారు. విశ్వనాథ్ దర్శకత్వంలో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలలో చిరంజీవి నటించారు. చిరంజీవి తొలిరోజుల్లో బాపు గారి దర్శకత్వంలో తొలి విజయవంతమైన చిత్రాన్ని మన ఊరి పాండవులు ద్వారా అందుకున్నారు.

అలాగే విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయంకృషి, ఆపద్బాంధవుడు చిత్రాల్లో నటించి ఉత్తమ నటుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ శుభలేఖ చిత్రం విజయవంతంగా నిలిచింది. బాలచందర్ దర్శకత్వంలో చేసిన రుద్రవీణ చిత్రం మిగతా చిత్రాలకంటే ఉత్తమ నటునిగా పేరు తెచ్చినప్పటికీ.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం విజయవంతంగా నిలిచింది. చిరంజీవి ద్విశత చిత్రాల వైపు తన సినీ ప్రయాణంలో ఈ కళా దర్శకుల ఆణిముత్యాలైన.. మన ఊరి పాండవులు,ఇది కథ కాదు, 47 రోజులు, మంత్రి గారి వియ్యంకుడు, ఆడవాళ్లు మీకు జోహార్లు, శుభలేఖ, రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి చిత్రాలు చిరంజీవి అభినయానికి సోపానాలుగా నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here