పాన్ ఇండియన్ సినిమా అంటే అన్నీ రకాలుగా జనాలను మెప్పించడం అంత ఈజీ కాదు. ఈ విషయం తాజాగా రిలీజైన పుష్ప సినిమా విషయంలో రుజువైందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి రేంజ్ సినిమా తీయాలని అందరు దర్శకులు ఇప్పుడు ఎంతో కసితో సినిమాలను తెరకెక్కితున్నారు. కానీ, దర్శక ధీరుడు చేస్తున్న మ్యాజిక్‌ను చేయలేకపోతున్నారు. ప్రస్తుతం పుష్ప సినిమా మీద ఉన్న భారీ అంచనాలు ఒక్కరోజులో మారిపోయాయి.

తెలుగులో బాహుబలి సిరీస్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో రూపొందుతున్న సినిమా పుష్ప. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ పార్ట్ 1 అంటూ చిత్రబృందం మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీస్ వారికి దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ లకు ఇది మొదటి పాన్ ఇండియన్ సినిమా. అందుకే అందరూ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో చెప్పనవసరం లేదు. కేవలం ఒక్క అల్లు అర్జున్ పాత్ర తీర్చిదిద్దటానికే చాలా సమయం తీసుకున్నాడు సుకుమార్.

కెరీర్‌లో మొదటిసారి అల్లు అర్జున్ మాస్ క్యారెక్టర్ చేయడం సినిమా మీద మంచి అంచనాలు పెంచింది. ఇక సుకుమార్ రంగస్థలం సినిమా తర్వాత తన పంతా మార్చి కథలను వేరే జోనర్‌లో ఎంచుకోవడం కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. సినిమా షూటింగ్ సమయంలో దాదాపు 17 గంటలు అందరూ శ్రమించారు. అయితే ఇప్పుడు ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలం అందిందా అంటే సరైన సమాధానం రావడం లేదు. సినిమాకు ముందు ఒక్కో అంశంతో అంచనాలు పెంచుకుంటూ వస్తే ఇప్పుడు ఒక్కో లోపం ఏంటనేది జనాలు మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమా రివ్యూలే కొంతవరకు సినిమా స్థాయిని చెప్పకనే చెప్పాయి. వాటిని లైట్ తీసుకున్నా ప్రేక్షకులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసుకున్నారు. ముఖ్యంగా సుకుమార్ స్లో నరేషన్ సినిమా మీద బాగా ఎఫెక్ట్ చూపించింది అనే ప్రధాన లోపంగా చెప్పుకుంటున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీకి పాజిటివ్ గా మాట్లాడుతున్న వారు చాలా తక్కువ. బీజీఎం విషయంలో ఆయనను నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప సినిమాకు మరో పెద్ద మైనస్ మ్యూజిక్ అని తేల్చి చెప్పేస్తున్నారు.

బాహుబలి సిరీస్‌తో పోల్చుకున్న జనాలు ఇప్పుడు పొరపాటున కూడా పోలిక కరెక్ట్ కాదు అని చెప్పుకుంటున్నారు. కథా నేపథ్యం కూడా లోపంగా భావిస్తున్నారు. ఇక హీరోయిన్ విషయంలోనూ సుకుమార్ టీమ్ సరైన డెసిషన్ తీసుకోలేదనేది మరో టాక్. మొత్తంగా చూస్తే పుష్ప సినిమాకు ఒక్క అల్లు అర్జున్ తప్ప మిగిలింది ఏదీ కలిసొచ్చే అంశం కాదనేది ఒక్కరోజు తర్వాత వినిపిస్తున్న అభిప్రాయాలు. ఇలాంటి నేపథ్యంలో బ్రేకీవెన్ టార్గెట్ రీచ్ అవుతుందా అనేది కొన్నాళ్ళు ఆగితేగానీ తెలీదు.

































