ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. హీరో, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాత ( ప్రొడక్షన్ హౌస్).. వీరిలో ఎవరు ముందు ఇండస్ట్రీకి పరిచయం అయినా డెబ్యూ ప్రాజెక్ట్ తోనే భారీ హిట్ అందుకోవాలి. కనీసం యావరేజ్ హిట్ అందుకొని విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటే చాలు. ఆ తర్వాత ఎవరో ఒకరు రెండవ సినిమా అవకాశం ఇస్తారు. అందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లా సెంటిమెంట్స్ గురించి పట్టించుకోకుండా టాలెంట్‌ని నమ్మీ గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్‌కి అవకాశం ఇచ్చినట్టు ఇవ్వరు కదా. ఇక్క్డ సక్సెస్ ఫార్ములానే పనిచేస్తుంది. అదే ప్రధానం.

ఈ ఒక్క కారణంతోనే ఎన్నో ఆశలు, కలలు కంటూ ఇండస్ట్రీకొచ్చిన వారు వెనుతిరగాల్సి వచ్చింది. సగం మందికి లక్ కలిసి వచ్చి మొదటి సినిమా పోయినా మళ్ళీ అవకాశం అందుకొని సక్సెస్ అయ్యారు. ఇక చాలా తక్కువ శాతం మాత్రమే మొదటి రెండు మూడు సినిమాలు పోయినా నిలదొక్కుకునారు. స్టార్ హీరోయిన్ కెరీర్‌ని లీడ్ చేసి ఇండస్ట్రీ హిట్స్ అందుకొని, ఇప్పుడు గొప్ప పాత్రల్లో నటించే అవకాశం అందుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ పాత్ర వాళ్ళు మాత్రమే చేయగలరు అనే కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ఇలాంటి వారిలో రమ్యకృష్ణ ఒకరు.

రమ్యకృష్ణ తమిళ పరిశ్రమలోని ప్రముఖ పాత్రికేయులు, సినీ విమర్శకులు రామస్వామి మేనకోడలు. దాంతో ఈమె ఇండస్ట్రీకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక మాత్రం సక్సెస్‌లు కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొన్ని విమర్శలు ఎదురుకున్నారు. రమ్యకృష్ణ 1985లో భలే మిత్రులు చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు చిత్రరంగంలో అడుగుపెట్టారు. 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రం ద్వారా మంచి నటిగా పేరు సంపాదించినప్పటికీ, అందులో చేసింది గ్లామర్ రోల్ కాకపోవడం వల్ల తనకి 5 – 6 ఏళ్ళ వరకూ పెద్ద అవకాశాలు రాలేదు.

అంతేకాదు కెరీర్ ప్రారంభంలో రమ్యకృష్ణ ఐరెన్ లెగ్ అనే టాక్ కూడా వినిపించింది. ఆమె నటిస్తే సినిమా ఫ్లాప్ గ్యారెంటీ అని కూడా చెప్పుకున్నారు. కానీ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించగా 1992 లో రిలీజయిన అల్లుడుగారు సినిమా తన సత్తా ఏంటో నిరూపించింది. మంచు మోహన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు రమ్యకృష్ణ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అయితే అందరు తనని తీసుకోవాలంటే ఆలోచించేవారు. కానీ కె. రాఘవేంద్రరావు మాత్రం తనలో ఓ గొప్ప నటి ఉందని నమ్మారు.

అందుకే ఎక్కువగా ఆయన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలలో రమ్యకృష్ణకి వరుసగా హీరోయిన్ వేశాలిచ్చారు. వీరి కాంబినేషన్‌లో వచ్చినా దాదాపు అన్నీ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో అప్పటి నుంచి సినిమా హిట్ అవ్వాలంటే రమ్యకృష్ణ ఉండాల్సిందే అని దర్శక, నిర్మాతలతో పాటు హీరోలు నమ్మారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన నరసింహ ఆమె కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఇప్పటి తరం హీరోయిన్స్ చాలా మందికి ఆ పాత్ర ఎంతో ఇన్స్పిరేషన్. అలా టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోలతో, స్టార్ డైరెక్టర్స్ తో పనిచేశారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా రమ్యకృష్ణ కెరీర్ లో ఎంతో ప్రత్యేకం. శివగామిగా రమ్యకృష్ణ బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ నటిగా పాపులారిటీ సాధించారు.































