ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. మన టాలీవుడ్‌కు పరభాషా నటులు రావడం కొత్తేమీ కాదు. అలాగే ముంబై ముద్దుగుమ్మలు, మోడల్స్ వచ్చి పాతుకుపోతున్నవారూ ఉన్నారు. మన తెలుగు వాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదు. తెలుగులోనే అద్భుతమైన నటులున్నారు. అయినా పక్క రాష్ట్రం వారిని తీసుకొచ్చి అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారని సీనియర్ నటులు కోట శ్రీనివాస్ లాంటి వారు ఓ వైపు చురకలంటిస్తున్నా.. ఇక్కడ టాలెంట్ ఉంటే ఎవరైనా వచ్చి సత్తా చాటవచ్చు అనే విధంగా పరభాషా నటీ నటులకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు.

ప్రేక్షకులు కూడా అలాంటి నటీ నటులను బాగానే ఆదరిస్తున్నారు. కేవలం ప్రకాశ్ రాజ్‌ను మాత్రమే కాదు యాత్ర సినిమాతో మమ్ముట్టి, జనతా గ్యారేజ్ మూవీతో మోహన్ లాల్, మహానటి సినిమాతో ఆయన కొడుకు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ లాంటి వారు వాచ్చి మంచి పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, ఆయన భార్య నజియా, కిచ్చా సుదీప్ ఇలా చాలామంది నటీ నటులు తెలుగు ఇండస్ట్రీలో కీలక పాత్రలు పోషించే అవకాశాలు అందుకుంటున్నారు.
ఇక్కడ ప్రేక్షకుల్లో కూడా వీరికి మంచి గుర్తింపు ఆదరణ దక్కుతున్నాయి. అయితే వీరంతా క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్నారు. వారి భాషలలో హీరోగా నటించినా కూడా మన తెలుగులో మాత్రం క్యారెక్టర్ మాత్రమే దక్కుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మన టాలీవుడ్ మీద తమిళం, మలయాళం ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఇక్కడ హీరోగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. కోలీవుడ్‌లో సూర్యకు స్టార్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. కానీ ఆయన ఇప్పటి వరకు తెలుగులో స్ట్రైట్ సినిమా చేయలేదు.
కానీ విజయ్ మాత్రం గ్రాండ్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. మహేశ్ బాబుతో చేయాల్సిన కథనే నిర్మాత దిల్ రాజు – దర్శకుడు వంశీ పైడిపల్లి విజయ్ హీరోగా ఇక్కడ రూపొందిస్తున్నారు. ఇది పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కబోతోంది. అలాగే ధనుష్ కూడా తెలుగులో స్ట్రైట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకుడు. తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఈ సినిమా రూపొందుతుండగా, లవ్ స్టోరి చిత్రాన్ని నిర్మించిన ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయట.
ఇక మరో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కూడా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు జాతి రత్నాలు సినిమా ద్వారా బాగా పాపులర్ అయిన కె వి అనుదీప్ దర్శకత్వం వహించనున్నాడట. అయితే ఇక్కడ మన హీరోలకే సరిగా అనుకున్న ప్రాజెక్ట్స్ చేయలేకపోతున్నారు. చేసిన సినిమాలతో హిట్స్ దక్కక ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తున్నారు. అలాంటిది ఇతర భాషలలోని హీరోలు వచ్చి ఇక్కడ నిలబడగలరా అనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి వీరంతా తెలుగులో హిట్ కొట్టి సత్తా చాటుతారా లేదా.



































