గత ఏడాది నుంచి సినిమా ఇండస్ట్రీకి అన్నీ కష్టాలే. అందుకు కరోనా వేవ్స్ అని అందరికీ తెలిసిందే. భారీ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ఇక మరికొన్ని రోజుల్లో ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళనుంది అనుకుంటుండగానే కరోనా ఫస్ట్ వేవ్ వచ్చి పడింది. దాంతో మొదలవ్వాల్సిన సినిమాలు, ఆల్రెడీ షూటింగ్ దశలో ఉన్న సినిమాలు, సెన్సార్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కావాల్సిన సినిమాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దాంతో ప్రతీ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొన్ని కాంబినేషన్స్‌లో తెరకెక్కాల్సిన సినిమాలు ఆగిపోయి కొత్త కాంబినేషన్‌లో మళ్ళీ ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేశారు. పోనీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందా అంటే అఫీషియల్‌గా అందుకు సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ ఇవ్వడం లేదు. మళ్ళీ అదే కాంబో సెట్స్ మీదకు వస్తుందా అంటే గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

గత ఏడాది కొరటాల శివ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో యువసుధ ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. గీతా ఆర్ట్స్ వారి సహకారంతో అల్లు అర్జున్ కెరీర్‌లో 21వ సినిమాగా దీనిని తెరకెక్కించాలనుకున్నారు. కానీ, అప్పటికే కొరటాల కమిటయిన ఆచార్య పూర్తి కాక బన్నీ సినిమా ఆగిపోయింది. దాంతో పాటే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయాల్సిన ఐకాన్ మూవీ అటకెక్కింది.

ఈ క్రమంలో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సిరీస్ చేస్తున్నాడు అల్లు అర్జున్. దీని తర్వాత కొరటాల సినిమా ఉండే అవకాశం ఉంది. ఇక ఎన్.టి.ఆర్ – త్రివిక్రం కాంబినేషన్‌లో ఓ మూవీ అనౌన్స్ అయింది. కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్ క్యాన్సిల్ అయింది. అలాగే కొరటాల శివ – మహేశ్ బాబు ప్రాజెక్ట్ ఉండాలి. అది క్యాన్సిల్ అయి కొరటాల ఎన్.టి.ఆర్‌తో త్రివిక్రం మహేశ్ బాబుతో సినిమాలను తెరకెక్కించబోతున్నారు. ఇక విజయ్ దేవరకొండ హీరోగా నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ ఓ సినిమా చేయాలి.

కానీ ఇంకా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ పూర్తి కాలేదు. దానికి తోడు శివ నిర్వాణ ఇటీవల నానితో తెరకెక్కించిన టక్ జగదీష్ ఫ్లాపయింది. అందుకే మళ్ళీ ఓ కొత్త కథ రాసుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో వీరి కాంబో ప్రాజెక్ట్ గురించి నో అప్‌డేట్స్. ఇక ఎన్.టి.ఆర్ – కేజీఎఫ్ చితాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉండాలి. కానీ ఆర్ఆర్ఆర్ ఆలస్యం కావడంతో ఆయన ప్రభాస్‌తో సలార్ సినిమాను మొదలు పెట్టాడు. సలార్ అయ్యాకే ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుంది. ఇలా చాలా కాంబినేషన్స్‌లో మొదలవ్వాల్సిన ప్రాజెక్ట్స్ కరోనాతో పాటు రక రకాల కారణాల వల్ల మారిపోయాయి. ఇవి ఎప్పటికి మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి.

































