సినిమాలో వచ్చే ప్రతి పాట ప్రేక్షకుల్ని ఉపశమనానికి, ఉల్లాసానికి అవకాశం కల్పిస్తుంది.కథలో లీనమై వెళ్తున్న ప్రేక్షకుల్ని కాసేపు సరససల్లాపాలలోకి తీసుకెళుతుంది. పాటలో వచ్చే పదం ప్రేక్షకుడి మెదడుకు పదును పెడితే, పాటలో కదిపే పాదం ప్రేక్షకుడిని నర్తించేలా చేస్తుంది. పదాలతో ప్రేక్షకులకు చంద్రబోస్ దగ్గరయ్యారు. పాదము కదిపి సుచిత్ర ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. తెర వెనుక ఒకరు పదము రాస్తే..తెరపై మరొకరు పాదము కలుపుతారు.

వరంగల్ జిల్లాకు చెందిన చంద్రబోస్ హైదరాబాదులో ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసి,తన స్నేహితుడు ద్వారా ముప్పలనేని శివను కలిశారు. అప్పటికే ఆయన “ఘరానా అల్లుడు” చిత్రాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత డి.రామానాయుడు నిర్మాతగా దర్శకుడు ముప్పలనేని శివ తాజ్ మహల్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో చంద్రబోస్ పాట రాయడానికి దర్శకుడు ముప్పలనేని శివ అవకాశం కల్పించారు. అలా ఆ చిత్రంలో “మంచు కొండల్లో చంద్రమా.. చందనాలు చల్లిపో” అనే పాటను మొదటి సారిగా చంద్రబోస్ రాయడం జరిగింది. ఆ తర్వాత పెళ్లి సందడి చిత్రంతో ఆయన రాఘవేంద్రరావు దర్శకత్వంలో పాటలు రాసే అవకాశం పొందారు.

ఎస్.వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన “పెళ్లి పీటలు” చిత్రానికి సుచిత్రా, చంద్రబోస్ కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆ క్రమంలో వీరిద్దరూ చెన్నై టు హైదరాబాదు విమానంలో పక్కపక్కనే కూర్చొని ప్రయాణం చేశారు. అప్పుడు చిగురించిన వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది.

1988లో అశ్వినీదత్ నిర్మాణం, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆఖరి పోరాటం చిత్రంలో నాగార్జున, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సుచిత్ర మొదటిసారిగా కొరియోగ్రాఫర్ గా మారారు. ఆ తర్వాత చైతన్య, గాండీవం,వన్ బైటూ, జయం మనదేరా, వినోదం, అన్నమయ్య, మనసంతానువ్వే, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, ఝుమ్మందినాదం, గోపాలగోపాల వంటి చిత్రాలకు సుచిత్ర కొరియోగ్రాఫర్ గా చేశారు.

అయితే వారి స్నేహం కాస్త ప్రేమగా మారడంతో చంద్రబోస్ ముందుగా సుచిత్రకి ప్రపోజ్ చేయడం జరిగింది. ముందుగా సుచిత్ర ప్రపోజల్ కు ఒప్పుకోలేదు. ఆ తర్వాత చంద్ర బోస్ తన స్వచ్ఛమైన ప్రేమ గురించి వివరించి చెప్పడంతో.. ఇద్దరి మధ్య అంగీకారం కుదిరింది. అలా ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన పెళ్లిపీటలతో వారు పెళ్లిపల్లకి ఎక్కారు. సినీ కెరీర్ లో చంద్రబోస్ కంటే సుచిత్ర ఆరు సంవత్సరాలు సీనియర్ కావడం గమనార్హం.






























