నందమూరి తారక రామారావు నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్.టి.ఆర్‌గా, అన్నగా ప్రజలకి ఎనలేని సేవ చేశారు. ఆయన సినీ, రాజకీయ రంగాలలో ఎన్నో అద్భుతమైన విషయాలు, విశేషాలు.. కోట్ల ప్రజలకి తెలియని విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. భాష ఏదైనా బయోపిక్ సినిమాలకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే మేకర్స్ అన్నీ ప్రధాన భాషలలో సినీ, రాజకీయ, క్రీడా కారుల జీవిత కథలను ఆధారంగా చేసుకొని కొంత కల్పితాన్ని జతచేసి కమర్షియల్ అంశాలను కలుపుకొని సినిమాగా మలిచి సక్సెస్ అందుకుంటున్నారు.

కమర్షియల్ సినిమాలలో నాలుగు ఫైట్లు, ఆరు పాటలు కొన్ని పనికిమాలిన సన్నివేశాలు చూసి చూసి విసిగిపోయిన ప్రేక్షకులకి బయోపిక్స్ బాగా ఊరట కలిగిస్తున్నాయి. వాస్తవ సంఘటనలతో రూపొందించే సినిమాల మీద బాగా ఆసక్తి చూపిస్తున్నారు. హిందీలో దంగల్, సూపర్ 30, ప్యాడ్ మ్యాన్ లాంటి సినిమాలు వచ్చి భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని కాసుల వర్షం కురిపించాయి. అలాగే తెలుగులో రక్త చరిత్ర, మహానటి సావిత్రి బయోపిక్ మహానటి సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక్కడ ఆర్జీవీ కూడా ఎక్కువగా వాస్తవ సంఘటనలతోనే సినిమాలు తీసి తిట్టించుకుంటూ, పొగిడించుకుంటున్నారు.

ఇదే క్రమంలో నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా తన తండ్రి సినీ, రాజకీయ జీవితాన్ని సినిమాగా రూపొందించాలనుకున్నారు. విజయవంతగా 99 సినిమాలు చేసిన బాలయ్య 100 వ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలని గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాను చేశారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్య 100వ సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు బాలయ్య కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగానూ నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెడతారని అందరూ భావించారు. కానీ 100కి ముందు ఎలాగైతే సినిమాలను కమిటయ్యారో ఆ తర్వాత కూడా అలాగే సినిమాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే 101వ సినిమాగా పైసా వసూల్ 102వ సినిమాగా జై సింహా చేశారు. అలాగే తన తండ్రి ఎన్.టి.ఆర్ బయోపిక్ చేయాలనుకున్నారు. సినిమాకి సంబందించిన కథను ఒక భాగంగా రాజకీయానికి సంబంధించిన కథను ఒక భాగంగా చేయాలనుకున్నారు. అలాగే ఎన్.టి.ఆర్. కథానాయకుడు, ఎన్.టి.ఆర్. మహానాయకుడు సినిమాలను 103, 104 గా చేశారు. ఈ రెండు భాగాల మీద ప్రేక్షకుల్లో ఇండస్ట్రీ వర్గాలలో భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. ముందు తేజ దర్శకత్వంలో మొదలైన ఈ ప్రాజెక్ట్‌కి ఆయన ఆదిలోనే తప్పుకొని క్రిష్ వచ్చి చేరారు.

ఇక మొదటి భాగం విడుదలైయ్యే సమయంలో అందరూ ఈ సినిమా గురించే చర్చించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య ఎన్.టి.ఆర్. కథానాయకుడు విడుదలయింది. కానీ సినిమాకి డివైడ్ టాక్ వచ్చి అభిమానులను బాగా డిసప్పాయింట్ చేసింది. ఆశించినంతగా ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. అంతా అతుకుల బొంతలా ఉందనే కామెంట్స్ వచ్చాయి.

దాంతో ఎన్.టి.ఆర్. మహానాయకుడు మీద ఫోకస్ పెట్టారు. ఓ నెలరోజుల వ్యవధిలో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇది అదే పరిస్థితి. దాంతో బాలయ్య అనవసరంగా తండ్రి బయోపిక్ తీసి చెడగొట్టారని చెప్పుకున్నారు. కనీసం ఒక భాగం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోవడం నిజంగా దురదృష్టకరమే అని ఇండస్ట్రీ వర్గాలు కూడా అనుకున్నాయి. అసలు కథలో చెప్పాల్సిన అంశాలు చెప్పలేదని బాలయ్య అసలు సూటవలేదని.. ఇలా రక రకాలుగా చెప్పుకున్నారు.































