“అబ్బనీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా.. వయ్యారాల వారేవా”….” బలపం పట్టి భామ బళ్ళో అఆఇఈ నేర్చుకుంటా.. పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా ఓహో పాడుకుంటా.. అమ్మ హా అంట అమ్మడు..” ఈ రెండు పాటలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బాణీలు సమకూర్చారు. అప్పట్లో ఆకాశవాణిలో ఉర్రూతలూగించిన ఈ రెండు పాటలను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదంటే అతిశయోక్తి కాదు.

1990లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి, బొబ్బిలిరాజా చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించాయి. ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమా చేయాలనుకున్నారు. అందుకోసం ఒక కథ కోసం ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్, సత్యానంద్ లాంటి రచయితలు ఒక సోషియో ఫాంటసీ స్టోరీని సిద్ధం చేశారు. ముందుగా కథ అశ్వినీదత్, చిరంజీవిలకు వినిపించారు.

కొన్ని స్వల్ప మార్పులతో ఆ కథను వారిద్దరూ ఒప్పుకొన్నారు. ఇలాంటి ఓ ఫాంటసీ చిత్రానికి దర్శకుడు ఎవరైతే బాగుంటుందని ఆలోచించే క్రమంలో… రాఘవేంద్రరావు అయితే ఈ సినిమాకి న్యాయం చేయగలరని దర్శకుడిగా ఆయనను ఎంచుకున్నారు. దేవకన్యగా శ్రీదేవి బావుంటుందని హీరోయిన్ గా తీసుకున్నారు. అలా ఈ సినిమా 1990 మేలో విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ చిత్రంలోని పాటలు ఆంధ్రదేశమంతటా ఒక ఊపు ఊపాయి.

ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో లో వెంకటేష్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఆ క్రమంలో పరిచూరి బ్రదర్స్ ఒక కథ సిద్ధం చేశారు. కానీ కొన్ని మార్పులు చేర్పులతో చివరిగా కథ ఫైనల్ అయ్యింది. అప్పటికి సురేష్ ప్రొడక్షన్స్ లో బి.గోపాల్ కొన్ని చిత్రాలు చేసినప్పటికీ ప్రేమకథా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను బి.గోపాల్ చిత్రీకరించగలడా అనే సందేహాన్ని నిర్మాత వ్యక్తం చేశారు. పరుచూరి బ్రదర్స్ నచ్చజెప్పడంతో బొబ్బిలిరాజా చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశాన్ని బి.గోపాల్ కి ఇచ్చారు. అడవి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆరోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అందించిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయితే ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించినప్పటికీ… 1990 సంవత్సరానికి గాను జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా పిల్లలు పెద్దలు విరగబడి చూడడంతో 29 కేంద్రాలలో వంద రోజులు, ఐదు కేంద్రాల్లో 200 రోజులు, హైదరాబాద్ ఓడియన్ 70MM థియేటర్ లో 365లు ప్రదర్శింపబడి 6 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి ఆల్ టైం హిట్ గా ఈ సినిమా నిలిచిపోయింది.

బొబ్బిలి రాజా చిత్రం అటు క్లాస్ ఇటు మాస్ ను ఆకట్టుకొని 25 కేంద్రాల్లో 100 రోజులు 3 కేంద్రాల్లో 200 రోజులు సినిమా ప్రదర్శింపబడి 5 కోట్ల షేర్ వసూలు చేసింది. కానీ ఈ సినిమా నిర్మాత డి.సురేష్ బాబు బొబ్బిలిరాజా చిత్రం ఇండస్ట్రీ హిట్ అనడంతో కాస్త వివాదం చోటు చేసుకుంది. కానీ కలెక్షన్స్ వారీగా చూస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఒక్కటే ఆ సంవత్సరం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బొబ్బిలిరాజా, కర్తవ్యం చిత్రాలు ఆ సంవత్సరం బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.






























