తెలుగు సీనియర్ నటుడు నరసింహరాజు తెలుసు కదా. ఆయన గురించి ఈ జనరేషన్ పిల్లలకు తెలియదు కానీ.. 1970 టైమ్ లో ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఆయనకు ఉన్న ముద్దు పేరు ఏంటో తెలుసా? ఆంధ్రా కమల్ హాసన్. ఆయన 1970 నుంచి చాలా సినిమాల్లో హీరోగా నటించి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపుగా ఆయన 100కు పైగా సినిమాల్లో నటించి.. ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

నరసింహరాజు.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో 1951న జన్మించారు. చిన్నప్పటి నుంచే నరసింహరాజుకు సినిమాలంటే పిచ్చి. అందుకే.. తన పీయూసీ చదువు అయిపోగానే.. ఇంట్లో చెప్పకుండా.. మద్రాస్ రైలు ఎక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ ఇంటికి తిరిగి వచ్చి.. తన తల్లిదండ్రులను ఒప్పించి.. సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.
జగన్మోహిని సినిమాతో తన సత్తా చాటిన నరసింహరాజు

నరసింహరాజు 1974లో నీడలేని ఆడది అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమా కూడా విజయవంతం అయింది. ఆ తర్వాత అమ్మాయిలూ జాగ్రత్త, తూర్పు పడమర అనే సినిమాల్లో నటించారు. 1978 లో జగన్మోహిని అనే సినిమాలో హీరోగా నటించిన నరసింహరాజుకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాకు విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఆ సినిమాతోనే నరసింహరాజుకు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతులేని వింత కథ, అత్తవారిల్లు, కన్యా కుమారి, కలియుగ మహాభారత, పున్నమి నాగు, పునాది రాళ్లు, నీడలేని ఆడది, ప్రయాణంలో పదనిసలు, రంభ ఊర్వశి మేనక, లక్ష్మీ పూజ లాంటి సినిమాల్లో నటించారు.
జగన్మోహిని సినిమాకు అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న హీరోలను ముందు అనుకున్నారట

జగన్మోహిని సినిమా 1970వ దశకంలో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ సినిమా అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ రికార్డులనే బద్దలు కొట్టింది. ఆ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నరసింహరాజుకు కూడా మంచిపేరు వచ్చింది. అయితే.. ఆ సినిమాకు ముందుగా నరసింహరాజును హీరోగా అనుకోలేదట విఠలాచార్య. ఆయన అప్పటికే సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సీనియర్ హీరోలతో సినిమాలు తీశారు. అందుకే.. జగన్మోహిని సినిమాలో కూడా వాళ్లలో ఎవరినైనా ఒకరిని హీరోగా పెట్టుకుంటారని అందరూ భావించారట.

కానీ.. డైరెక్టర్ విఠలాచార్య మాత్రం జగన్మోహిని సినిమాకు నరసింహరాజు కరెక్ట్ గా సెట్ అవుతారని భావించి.. నరసింహరాజుకు ఆ అవకాశం ఇచ్చారట. ఒక విధంగా చెప్పాలంటే.. ఆ సినిమాలో నటించే అవకాశం దొరకడం నరసింహరాజు అదృష్టం. ఆ తర్వాతే ఆయన స్టార్ డమ్ పెరిగింది. ఇండస్ట్రీలో ఒక గుర్తింపు వచ్చింది. ఇంకా మంచి మంచి సినిమాలు చేసే అవకాశం దక్కింది. అలా ఆయన హీరోగా 110 సినిమాల్లో, 90 పైగా సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత ఆయన పలు తెలుగు సీరియళ్లలోనూ ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులను అలరించారు.































