ఒంగోలులో పోకూరి బాబూరావు డిగ్రీ మొదటి సంవత్సరంలో మొదటిరోజు కళాశాలలోకి ప్రవేశించాడు. సాధారణంగా మొదటి రోజు కాబట్టి పోకూరి బాబూరావు పెద్ద కాలర్ తో ఉన్న ఎర్ర చొక్కా వేసుకొని కళాశాలలోకి ప్రవేశించాడు. తనకంటే సీనియర్ అయిన టి.కృష్ణ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నారు. వామపక్ష భావజాలం ఉన్న టి.కృష్ణ ఎర్ర చొక్కాలో కనిపించిన బాబురావును చూసి స్నేహపూర్వకంగా దగ్గరికి తీశాడు. ఇక అప్పటి నుంచి టి.కృష్ణ పోకూరి బాబూరావు మధ్య స్నేహం చిగురించింది. టి.కృష్ణ ఒకవైపు చదువుకుంటూ.. నాటికలు వేస్తూ.. కళాశాలలో మొదటి బహుమతులు పొందేవాడు.

ఆ క్రమంలో పోకూరి బాబురావు చేత కూడా నాటకాల్లో పాత్రలు వేయించడం, అలాగే కళాశాల వార్షికోత్సవంలో అతనిచే పాటలు పాడించడం లాంటివి టి. కృష్ణ చేసేవాడు. నాటికలు, నాటకాల్లో అనుభవమున్న టి.కృష్ణ ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో ఆయన మద్రాసు వెళ్లారు. ప్రముఖ దర్శకుని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా టి.కృష్ణ చేరాడు. కానీ సినిమా అవకాశాలు పెద్దగా దొరకలేదు.

అయితే తామే సొంతంగా ఓ సినిమా తీద్దామని టి.కృష్ణ, పోకూరి బాబూరావు అనుకున్నారు. ఒంగోలులో ఒకే కళాశాలలో చదువుకున్న టి.కృష్ణ (బీకాం ఫైనల్ ఇయర్) పి.బాబురావు (బీకాం ఫస్ట్ ఇయర్) చిరంజీవి (ఇంటర్మీడియట్..) మద్రాసులో ఒక రోజు “మన ఊరి పాండవులు” చిత్రం చూసిన టి.కృష్ణ, బాబురావు, ఆ సినిమాలో నటించిన చిరంజీవిని మన కళాశాలలో చూసానని కృష్ణ చెప్పడంతో.. చిరంజీవి గురించి వాకబు చేస్తే నిజంగానే ఒంగోలులో తమ జూనియర్ గా చదివాడని తెలిసింది.

అయితే చిరంజీవి హీరోగా.. మహాత్మా గాంధీ చెప్పిన చెడు అనకు, చెడు వినకు, చెడు కనకు అనే మాటకు రివర్స్ లో ఓ సినిమా చేద్దామని అనుకున్నారు. ఆ క్రమంలో కథ మెల్లి మెల్లిగా.. తయారు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చిరంజీవి తన సినీ పరంపరలో భాగంగా, అభిలాష, ఆరని మంటలు వంటి విజయవంతమైన సినిమాలో నటిస్తూ.. 1983లో ఏకంగా “ఖైదీ” అనే ఇండస్ట్రీ హిట్ సినిమాతో వారికి అందనంత ఎత్తుకు ఎదిగి పోయాడని టి.కృష్ణ, పోకూరి బాబూరావు తయారు చేసుకున్న “చెడు అను, చెడు విను, చెడు కను” సినిమా కథని మధ్యలోనే విరమించుకున్నారు. ఆ తరువాత మరో కొత్త కథతో ఈతరం ఫిలిమ్స్, టి.కృష్ణ దర్శకత్వంలో “నేటి భారతం’ చిత్రం రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ తర్వాత రోజుల్లో కూడా ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ లో చిరంజీవి తో ఒక్క సినిమా కూడా రాక పోవడం గమనార్హం.
































