కథానాయకుడికి ప్రతికథా నాయకుడు లేనట్లయితే ఆ చిత్రాన్ని మనం ఊహించుకోలేం. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు ఏమైనా సినిమాల్లో వచ్చే అనేక మలుపులకు ప్రతి కథానాయకుడే కారణమవుతాడు. ఆ క్రమంలో కథానాయకుడి పై ఎక్కడలేని సానుభూతి ప్రతికథానాయకుడు తోనే వస్తుంది.

అప్పటి చిత్రాలలో దుష్ట పాత్రలను నాగభూషణం, సత్యనారాయణ, రావుగోపాల్ రావు వేసేవారు. ఆ క్రమంలో వారు కొన్ని సినిమాల్లో కీలకంగా మారి ఆ చిత్ర ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించేవారు. అయితే ఈ ముగ్గురిలో నాగభూషణం ముందుగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు.

1952 “పల్లెటూరు” అనే చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగభూషణం.. అనతికాలంలోనే ఆయన వేసిన దుష్ట పాత్రలు సినిమాలో అత్యంత ప్రధానంగా నిలిచేవి. మంచి మనుషులు, ఆదర్శ కుటుంబం, మోసగాళ్లకు మోసగాడు, అడవి రాముడు, జాతర లాంటి చిత్రాల్లో ఆయన వేసిన దుష్ట పాత్రలకు మంచి పేరు వచ్చింది.

1959 “సిపాయి కూతురు” అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన సత్యనారాయణ అనేక చిత్రాల్లో నటించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోల చిత్రాల్లో విలన్ గా ఆయన వేసిన దుష్ట పాత్రలు సినిమా ఘన విజయానికి ఎంతగానో తోడ్పడ్డాయి. దేవుడు చేసిన మనుషులు, యమగోల, అడవి రాముడు, వేటగాడు, డ్రైవర్ రాముడు, కొండవీటి సింహం, మంచి దొంగ, లంకేశ్వరుడు లాంటి చిత్రాలు కైకాల సత్యనారాయణకు మంచి పేరు తీసుకొచ్చాయి.

1966 “భక్త పోతన” చిత్రం ద్వారా రావుగోపాలరావు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే దుష్ట పాత్రల్లో ఎక్కువగా కనిపించారు. రావు గోపాల్ రావు కూడా ఎన్టీరామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలాంటి అనేకమంది అగ్ర హీరోల చిత్రాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. మన ఊరి పాండవులు, ఖైదీ, బొబ్బిలి బ్రహ్మన్న, దేవత, త్రిశూలం, అడవి దొంగ, యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి అనేక చిత్రాలు రావుగోపాలరావుకి మంచి పేరును తీసుకువచ్చాయి. రావు గోపాలరావు ధరించిన అనేక దుష్ట పాత్రల్లో “ముత్యాల ముగ్గు” చిత్రంలో రావుగోపాలరావు వేసిన దుష్ట పాత్ర అన్నిటికంటే భిన్నమైనదిగా పేర్కొనవచ్చు. అప్పట్లో నాగభూషణం, కైకాల సత్యనారాయణ, రావుగోపాల్ రావు ఈ ముగ్గురు దుష్ట పాత్రలు ధరించి ప్రేక్షకుల దృష్టిలో సమవుజ్జీలుగా నిలిచారు.
































