స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం పదిసార్లైనా గూగుల్ ను తలుచుకుంటూ ఉంటారు. మనకు ఎలాంటి సందేహం వచ్చినా అందుకు సమాధానం మాత్రం గూగుల్ లోనే లభిస్తుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ గూగుల్ సుపరిచితమే. అయితే గూగుల్ కు ఆ పేరు రావడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. వినడానికి గూగుల్ అనే పేరు వింతగా ఉన్నా గూగుల్ మన జీవితంలో భాగమైపోయింది.

22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఈ నెల 27వ తేదీతో 23వ ఏట అడుగుపెట్టింది. గూగుల్ అనే పేరు గూగోల్ అనే పదం నుంచి ఉధ్భవించింది. 100 సున్నాలతో ఉన్న సంఖ్యను గూగోల్ అని అంటారు. సెర్గేయ్ బ్రిన్, లారీ సేజ్ అనే స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా ప్రజలకు మరింత తేలికగా సమాచారం తెలిసే విధంగా చేయాలని భావించి గూగుల్ ను అందుబాటులోకి తెచ్చారు.
బ్రిన్, లారీ ఇద్దరూ కలిసి సెప్టెంబర్ 27, 1998న గూగుల్ ను ప్రారంభించారు. 1940 లో కాస్నర్ అనే గణిత శాస్త్రవేత్త మ్యాథమెటిక్స్ అండ్ ఇమాజినేషన్ అనే బుక్ లో గూగోల్ అనే పదం ఉపయోగించగా అనంతరం ఆ పదం నిఘంటువులోకి చేరింది. లారీ పేజ్, సెర్గే బ్రిన్ తమ కంపెనీకి ఫంకీగా పేరు పెట్టాలని అనుకున్నారు. వాళ్లు గూగోల్ ను కొద్దిగా మార్చి గూగుల్ ను అందుబాటులోకి తెచ్చారు.
గూగుల్ అంటే ఎంత సమాచారాన్ని అన్వేషించినా సులభంగా దొరుకుతుందని అర్థం. 2006లో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో గూగుల్ పేరును చేర్చారు. గూగుల్ వాడకం పెరిగే కొద్దీ ఈ పేరు మరింత పాపులర్ అవుతోంది. ఎన్నో సెర్చ్ ఇంజన్ లు అందుబాటులోకి వచ్చినప్పటికీ గూగుల్ స్థాయిలో మరే సెర్చ్ ఇంజన్ పాపులర్ కాకపోవడం గమనార్హం.































