యువరత్న బాలకృష్ణ మాస్ డైలాగులతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే ఆయన పర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. 1974లో తమ సొంత బ్యానర్, ఎన్టీరామారావు దర్శకత్వంలో వచ్చిన ‘తాతమ్మకల’ చిత్రంతో బాలకృష్ణ బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక అక్కడి నుంచి ఎన్టీ రామారావు చిత్రాలలో ఆయనకు కొడుకుగా, స్నేహితుడిగా నటించడం మొదలు పెట్టారు. ఆ క్రమంలో ఎన్ టి.రామారావుతో కె.రాఘవేంద్రరావు ఓ చిత్రాన్ని నిర్మించారు.

1980, రామకృష్ణ సినీ స్టూడియోస్, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీరామారావు, శ్రీదేవి, బాలకృష్ణ, రాజ్యలక్ష్మి కలిసి నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత బాలకృష్ణ సోలో హీరోగా, 1985 రామకృష్ణ సినీ స్టూడియోస్, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘పట్టాభిషేకం’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. పరుచూరి బ్రదర్స్ కథ అందించగా, చక్రవర్తి బాణీలు సమకూర్చారు. అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

1986, కె.రాఘవేంద్రరావు సోదరుడు కె.కృష్ణ మోహన్ రావు నిర్మాణం, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అపూర్వ సహోదరులు’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, విజయశాంతి, భానుప్రియ కలిసి నటించారు. బాలయ్య బాబు ఇందులో మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది.

1987 ,కె.సి.శేఖర్ బాబు నిర్మాణం, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘సాహస సామ్రాట్’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో బాలకృష్ణ,విజయశాంతి కలిసి నటించారు. ఎన్నో వివాదాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డీలా పడింది.

1988, గోపి ఆర్ట్ పిక్చర్స్,కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘దొంగ రాముడు’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ, రాధ, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక నిర్మాతలు బాలకృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో సినిమా అంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో భారీ చిత్రాల నిర్మాత అశ్వినీదత్ ఆ విషయాలన్నింటినీ పక్కకు వదిలేసి రాఘవేంద్రరావు, బాలకృష్ణ కలయికలో ఒక సినిమా రూపొందించాలనుకున్నారు.

1992, అశ్వినీదత్ నిర్మాణం,కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అశ్వమేధం’ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, నగ్మా, మీనా హీరో, హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరోగమనం పట్టింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో చిట్ట చివరి చిత్రంగా ‘పాండురంగడు’ 2008 లో వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ, స్నేహ, టబు హీరో హీరోయిన్లుగా నటించారు. భక్తిరస చిత్రమైనప్పటికి ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఇలా రాఘవేంద్రరావు, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం గమనార్హం.































