భారతీయ జీవన విధానంలో నేలపై కూర్చుని భోజనం చేయడం ఒక పాత సంప్రదాయం. పూర్వం నుంచి పెద్దలు ఈ అలవాటును ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పేవారు. అయితే ఆధునిక జీవనశైలిలో డైనింగ్ టేబుల్‌లు, కుర్చీలు విస్తృతంగా ఉపయోగంలోకి రావడంతో ఈ పద్ధతి కొంతమేర తగ్గిపోయింది. ప్రస్తుతం మళ్లీ చాలామందిలో ఈ అలవాటు మంచిదా కాదా అనే సందేహం పెరుగుతోంది.

నిపుణుల ప్రకారం, మనం భోజనం చేసే సమయంలో కూర్చునే విధానం జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. నేలపై కూర్చుని తినేటప్పుడు సాధారణంగా ముందుకు వంగే అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కువసేపు వంగి కూర్చుంటే పొత్తికడుపుపై ఒత్తిడి పెరిగి జీర్ణ ప్రక్రియ మందగించవచ్చు. దీనివల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి భంగిమలోనైనా భోజనం చేసినా, వెన్నెముక నిటారుగా ఉండటం చాలా ముఖ్యం.
అయితే నేలపై కూర్చుని తినడం పూర్తిగా హానికరం కాదని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా యువత, ఆరోగ్యంగా ఉన్నవారికి ఇది కొంతవరకు శరీరానికి వ్యాయామంలా పనిచేస్తుంది. కాళ్లు మడిచి కూర్చోవడం వల్ల శరీర భాగాలు చురుకుగా ఉంటాయి. భోజనం కోసం కింద కూర్చోవడం, మళ్లీ లేవడం వంటి చర్యలు కండరాల కదలికకు దోహదపడతాయి.
ఇక వయసు పైబడినవారికి మాత్రం జాగ్రత్త అవసరం. మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి ఉన్నవారు నేలపై కూర్చోవడం వల్ల సమస్యలు మరింత పెరగవచ్చు. కింద కూర్చుని మళ్లీ లేవడం సమయంలో శరీర బరువు మొత్తం మోకాళ్లపై పడుతుంది. దీని వల్ల మోకాళ్లపై ఒత్తిడి పెరిగి నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలంలో సంధివాతం సమస్యలు తీవ్రం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అందుకే ప్రతి ఒక్కరూ తమ శరీర పరిస్థితిని బట్టి భోజనం చేసే విధానాన్ని ఎంచుకోవడం మంచిది. మోకాళ్ల సమస్యలు ఉన్నవారు లేదా వృద్ధులు కుర్చీ, టేబుల్ ఉపయోగించడం ఉత్తమం. నేలపై కూర్చునే వారు వెన్ను నిటారుగా ఉంచడం, ఎక్కువగా ముందుకు వంగకుండా జాగ్రత్త పడాలి.
అదేవిధంగా భోజనం చేసిన వెంటనే పడుకోవడం కాకుండా కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సరైన భంగిమ, సరైన ఆహారపు అలవాట్లు కలిస్తేనే పూర్తి ఆరోగ్యం సాధ్యమవుతుంది.
మొత్తానికి, నేలపై కూర్చుని భోజనం చేయడం కొంతమందికి ప్రయోజనకరంగా ఉండొచ్చు, మరికొందరికి అసౌకర్యంగా మారవచ్చు. కాబట్టి ఏది మంచిదో అనేది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అవసరమైతే వైద్యుల సలహా తీసుకుని సరైన పద్ధతిని అనుసరించడం ఉత్తమం.































