తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిజిటల్ ఉద్యమానికి తెరలేపనున్నట్లు ప్రకటించారు. ప్రజలపై అన్యాయం జరిగితే, ప్రభుత్వ వేధింపులు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేసేందుకు ఓ ప్రత్యేక యాప్‌ను పార్టీ తరఫున విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ప్రజల ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్: జగన్ హామీ
జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ప్రజలకు అన్యాయం జరిగినా, తప్పు జరిగినా.. వెంటనే ఆ యాప్‌లో ఫిర్యాదు నమోదు చేయండి. ఎవరి వల్ల ఇబ్బంది కలిగిందో, ఏ అధికారి అన్యాయం చేశాడో వివరాలు ఇవ్వండి. ఆ ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలు, వీడియోలు, పత్రాలు కూడా యాప్‌లో అప్‌లోడ్ చేయండి. ఈ ఫిర్యాదులు ఆటోమేటిగ్గా మన డిజిటల్ సర్వర్‌కి చేరతాయి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై పరిశీలన జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.
ఇక ఈ ప్రక్రియలో ఎలాంటి అన్యాయం జరిగినా నిర్లక్ష్యం చేయబోమని హెచ్చరించారు. “మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తప్పుచేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం” అని జగన్ మరోసారి స్పష్టం చేశారు.
రెడ్‌బుక్‌పై వైసీపీ దృష్టి
జగన్ వ్యాఖ్యలతో పాటు, ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో రెడ్‌బుక్ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ రెడ్‌బుక్ తీసుకొచ్చి, “తప్పు చేసిన వారిని వదిలేది లేదు” అని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టే కేసులన్నీ కూడా రెడ్‌బుక్ ప్రకారమే జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రకటించిన ఈ యాప్, రెడ్‌బుక్ వివాదానికి మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది.
ప్రజలకు అవకాశం, భవిష్యత్ వ్యూహం
జగన్ ప్రకటించిన ఈ యాప్ ద్వారా రాష్ట్ర ప్రజలు నేరుగా తమ సమస్యలను, అన్యాయాలను డాక్యుమెంట్స్ సహా నమోదు చేయగలరు. ఫిర్యాదులు నేరుగా డిజిటల్ సర్వర్కి చేరుతాయి. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ యాప్ లాంచ్‌తో, వైసీపీ భవిష్యత్తు రాజకీయ వ్యూహాల్లో డిజిటల్ ఫిర్యాదు వ్యవస్థ కీలకంగా మారనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రజలతో నేరుగా అనుసంధానం కావడానికి, ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకతను కూడగట్టడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో అధికారులు, రాజకీయ నాయకుల వల్ల అన్యాయానికి, వేధింపులకి గురవుతున్న వారి కోసం కొత్త యాప్ తిసుకువస్తాం
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2025
ఆ యాప్ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారుల మీద మీరు కంప్లైంట్ ఇవ్వొచ్చు
రేపు మనం అధికారంలోకి వచ్చాక ఆ యాప్ ఓపెన్ చేసి చర్యలు తీసుకుంటాను – మాజీ సీఎం వైఎస్ జగన్ pic.twitter.com/BNih0Rmj7q




























