బిగ్ బాస్ సీజన్ 4 మొదటి వారం ఎన్ని విమర్శలు మూటగట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న విషయాలకే కంటెస్టెంట్లు ఏడవడంతో బిగ్ బాస్ షో సీరియల్ ను తలపిస్తోందనే కామెంట్లు కూడా వెలువడ్డాయి. అయితే రెండో వారం నుంచి బిగ్ బాస్ ఇస్తున్న టాస్కుల వల్ల షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఈ సీజన్ లో సైలెంట్ గా ఉన్న బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో విశ్వరూపం చూపించాడు. నియమ నిబంధనలు పాటించని కంటెస్టెంట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాడు. నిన్న బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ బీబీ టీవీలో భాగంగా కామెడీ షో జరిగింది.

అయితే తాజా ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ లోకి కొత్తగా ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అకస్మాత్తుగా లోపలి వచ్చిన ఆ వ్యక్తి తనను తాను జోకర్ గా చెప్పుకుంటూ పరిచయం చేసుకోవడం కనిపించింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనే కదా.. మీ సందేహం.? జబర్దస్త్ అవినాష్ మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అంటే ఈవారంలో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చినట్లు. ఇప్పటికే మొన్న కుమార్ సాయి బిగ్ బాస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ ల కంటె వినోదాత్మక కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే హౌస్ లో గ్లామర్ కు తక్కువేమీ లేదు. అదేవిధంగా ఓ లవ్ స్టోరీని పట్టాలు ఎక్కించారు. రెండో స్టోరీ వండుతున్నారు. మొదటిది ముక్కోణపు స్టోరీ.. దీనిలో అభిజిత్, అఖిల్, మోనాల్ తమ వంతు పులిహోర బాగానే కలుపుతున్నారు. ఇక రెండో జంటను సిద్ధం చేసే పనిలో బిగ్ బాస్ టీం ఉన్నట్టు కనిపిస్తోంది. కొన్నిరోజులు ఆగితేనే కానీ ఈ విషయం తేలదు.

ఇక అవినాష్ వచ్చాడు కాబట్టి కామెడీ స్కిట్లతో షో నడిపించే అవకాశం కనిపిస్తోంది! జబర్దస్త్ లాంటి క్రేజీ షో నుంచి అవినాష్ లాంటి టాప్ కమెడియన్‌ను బిగ్ బాస్‌కు తీసుకొచ్చారు. అక్కడే ఆయనకు మంచి పారితోషికం వస్తుంది. పైగా అవినాష్ టీం లీడర్ కూడా. దాంతో మల్లెమాల మంచి రెమ్యునరేషన్ ఇస్తుంది. అలాంటి అవినాష్ జబర్దస్త్‌కు బ్రేక్ ఇచ్చి మరీ బిగ్ బాస్‌కు వచ్చాడంటే ఆయనకు అంతకు మించి ఇచ్చుండాలి.. లేదంటే ఎందుకొస్తాడు అనే అనుమానాలు కూడా సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం అవినాష్ కి ఊహించిన దానికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి ఈయన్ని బిగ్ బాస్‌కు తీసుకొచ్చారు నిర్వాహకులు. పైగా పారితోషికం విషయంలో ఎలాంటి సమస్యా లేదని తొలివారం ఎలిమినేట్ అయిన దర్శకుడు సూర్యకిరణ్ క్లారిటీ ఇచ్చాడు. తను అనుకున్న దానికంటే కూడా పదిరెట్లు ఎక్కువ ఇచ్చారని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌కు కూడా భారీ పారితోషికం ఆఫర్ చేసారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్లలో అందరికంటే ఎక్కువగా లాస్యకు రోజుకు దాదాపు 50 వేలు ఇస్తున్నారని తెలిసింది. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్, దేత్తడి హారిక లాంటి వాళ్లు కూడా భారీగానే తీసుకుంటున్నారు.

అయితే.. ఇప్పుడు అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకోడానికి అవినాష్ వచ్చేసాడని తెలిసింది. దాదాపు లాస్యతో సమానంగా ఈయనకు పారితోషికం అందుతుందని విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. లాస్యకు రోజుకు 50 వేల కంటే పైనే అందుతుంది. ఈ లెక్కన అవినాష్ కూడా 50 నుంచి 60 వేల మధ్యలో రోజుకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడన్నమాట. పైగా ఇప్పట్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు కూడా లేవు. ఎందుకంటే వచ్చిన రోజే ఫుల్ ఎంటర్‌టైన్ చేసాడు అవినాష్. పైగా షోకు క్రేజ్ ఉండాలంటే ఇలాంటి ఇమేజ్ ఉన్న వాళ్లు కూడా అవసరమే. దాంతో ఎలా చూసుకున్నా కూడా అవినాష్ మరో 10 వారాలు అయితే కచ్చితంగా ఉంటాడని అంచనా. ఆ లెక్కన 70 రోజులు.. అంటే అటూ ఇటూగా బిగ్ బాస్ నుంచి 35 లక్షలకు పైగానే అందుకుంటున్నాడు అవినాష్. జబర్దస్త్‌లో ఎన్ని స్కిట్స్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది అనే వాళ్లు కూడా లేకపోలేదు. పైగా బిగ్ బాస్ షోకు వస్తే క్రేజ్ బాగానే పెరుగుతుంది కూడా. మళ్లీ వచ్చిన తర్వాత హాయిగా జబర్దస్త్ చేసుకుంటాడు. అలా తన కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుని బిగ్ బాస్ వైపు అడుగులేసాడు జబర్డస్ట్ అవినాష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here