వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు తిరిగి ఓ కీలక బాధ్యతను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి.

ఇటీవలి ఎన్నికల వరకు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన అంబటి, పార్టీని నిబద్ధతతో ముందుకు తీసుకెళ్లిన నేతగా పేరొందారు. అయితే, ఈ ఏడాది జనవరిలో జగన్ ఆయనను సత్తెనపల్లి సమన్వయ బాధ్యతల నుంచి తప్పించారు. అప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. రాజకీయంగా పక్కనబెట్టారని, ఇక ఆయనకు పెద్దగా చాన్స్ ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.
అయితే, అంబటి రాంబాబు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, తనకు సంబంధించిన బాధ్యతల్ని నిర్వర్తించడంలో ముందుండి నడిచారు. ముఖ్యంగా జగన్ ఇటీవల చేసిన పల్నాడు జిల్లా పర్యటనలో అంబటి కీలక పాత్ర పోషించారు. ఈ టూర్ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఆయనపై కేసు కూడా నమోదైంది.
ఈ నేపథ్యంలో ఆయనను గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించడాన్ని రాజకీయ పరిశీలకులు కీలక మలుపుగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎంపీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు ఏసు రత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మేయర్ కావటి మనోహర్ లాంటి సీనియర్ నాయకులు ఇప్పటికే ఉన్నారు. ఈ నియామకంతో వీరందరూ అంబటికి సహకరిస్తారా? లేదా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చా అంశంగా మారింది.
ఇటీవలి ఎన్నికల సమయాల్లో చిలకలూరిపేట నుంచి విడదల రజినిని పోటీకి దింపిన జగన్.. ఇప్పుడు గుంటూరు వెస్ట్ బాధ్యతను అంబటికి అప్పగించడం, వచ్చే ఎన్నికల దృష్ట్యా ఓ వ్యూహాత్మక చర్యగా భావించాలి. దీంతో అంబటి రాంబాబు తిరిగి కీలక బాధ్యతల్లోకి రావడంతో పాటు, జగన్‌తో ఆయన సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని ఈ నియామకం ద్వారా స్పష్టమవుతోంది.
ఇది పక్కా సంకేతం.. పార్టీలో అనుభవజ్ఞుల పాత్రను మరిచిపోనని, వారికి సరైన సమయంలో సరైన స్థానాన్ని కట్టబెడతామని జగన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీ అంబటి రాంబాబు గారిని నియమించిన పార్టీ అధ్యక్షులు @ysjagan గారు. pic.twitter.com/636NmOdYU1
— YSR Congress Party (@YSRCParty) June 24, 2025





























