ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న జగన్ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భారీ వర్షాల వల్ల నష్టపోయిన పత్తి, వేరుశెనగ రైతులను ఆదుకునేందుకు జగన్ సర్కార్ ముందుకొచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రైతులు పత్తి, వేరుశెనగ పంటలను అధిక తేమ, గింజ నాణ్యత వంటి కారణాల వల్ల అధిక ధరకు విక్రయించలేకపోతున్నారు.

అలాంటి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా కేంద్రం నియమ నిబంధనల్లో మార్పులు చేసి రైతులకు ప్రయోజనం చేకూరే దిశగా అడుగులు వేసింది. ఆర్బీకే కేంద్రాల్లో ఇప్పటివరకు టైం స్లాట్ విధానం ద్వారా రైతులు పంటను విక్రయించే అవకాశం ఉండేది. ఈ విధానంలో అనుకున్న సమయానికి కొనుగోలు కేంద్రానికి రైతులు పంటను తీసుకెళ్లకపోతే ఆర్బీకే కేంద్రాల్లో రైతులు మళ్లీ రిజిష్టర్ చేసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది.
అయితే ఈ నిబంధనల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్ ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్ తో సీజన్ లో ఎప్పుడైనా పంట వివరాలను నమోదు చేసే అవకాశం కల్పించింది. మారిన నిబంధనల ప్రకారం రైతులు ఏ రోజు పంటను అమ్మాలని భావిస్తే అదే రోజు ఆర్బీకే కేంద్రానికి తీసుకొని వెళ్లవచ్చు. సాధారణంగా నాఫెడ్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం 30 శాతం పంటను మాత్రమే నవంబర్ నెలలో రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది.
అయితే జగన్ సర్కార్ 75 శాతం పంటను రైతులు ఆర్బీకే కేంద్రాల్లో అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తోంది. మార్కెట్ లో 60 శాతం గింజ ఉన్న్ వేరుశెనగను వ్యాపారులు రూ.3500కు కొనుగోలు చేస్తుంటే జగన్ సర్కార్ వేరుశెనగను రూ.4500కు కొనుగోలు చేస్తుండటం గమనార్హం.





























