Jaggareddy-congress: కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం కాకలేపుతోంది. నిన్న కాంగ్రెస్ పార్టీకి తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజీనామా వ్యవహారంపై జగ్గారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. సీనియర్ల సూచన మేరకు రాజీనామా విషయాన్ని 15 రోజుల వరకు వాయిదా వేశారు. రాజీనామాపై ఎలాంటి కామెంట్స్ చేయనని అన్నారు.

ఇదిలా ఉంటే తనకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు జగ్గారెడ్డి. నా ఆవేదన మొత్తాన్ని వారికి చెబుతా అంటూ వ్యాఖ్యానించారు. ఈరోజు ఫిబ్రవరి 20 తేదీ ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీపై, నాయకత్వంపై ఎలాంటి కోపం లేదని.. అయితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నానని అన్నారు.

గాంధీ భవన్ లో కొంత మంది కామెంట్స్ చేశారని తెలిసిందని…
రాజీనామా వ్యవహారాన్ని కొందరు టీ కప్పులో తుఫాను అని అంటున్నారని.. అసలు సమస్య మూలాలకు వెళ్లడం లేదని ఆయన విమర్శించారు. సభ్యత్వ నమోదు ఇంఛార్జీ హరికర వేణుగోపాల్ రెడ్డిపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతేపోనీ.. దరిద్రం పోతుందని జగ్గారెడ్డి వ్యవహారంపై కామెంట్లు చేయడం కాంగ్రెస్ పార్టీలో మరింత వేడిని పెంచాయి.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చెపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డికి, జగ్గారెడ్డికి పడటం లేదు. ఇది హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఎక్కువ అయ్యాయి. ముందుగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో రేవంత్ రెడ్డికి పొసగకపోయినా.. ఇటీవల వీరిద్దరి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డే.. నేరుగా కోమటి రెడ్డి ఇంటికి వెళ్లి ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. ఇది సద్దుమణిగిందనే లోపలే… జాగ్గారెడ్డి వ్యవహారం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం జగ్గారెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.




























