KCR : రాజకీయాల్లోని ప్రముఖులు ఏ పని చేసినా కూడా దానికో అర్థం పరమార్థం ఉంటుంది. ప్రభుత్వం ఏ కీలక అడుగు వేసినా కూడా దానికి వెనుక అసలు మోటివ్ వేరే ఉంటుంది. తాజాగా రూ.2 వేల నోటు రద్దైంది. రద్దు చేసింది ఆర్‌బీఐ అయినా కూడా చేయించింది మాత్రం కేంద్రం అన్న విషయం చిన్న పిల్లాడికి కూడా తెలుసు. మరి ఉన్నట్టుండి సడెన్‌గా ఈ పని ఎందుకు చేసినట్టు అనే అనుమానం కలుగక మానదు. నిజానికి సైన్స్‌లోని కొన్ని సూత్రాలే రాజకీయాల్లోనూ కనెక్ట్ అవుతాయి. ఎక్కడో జరిగే ఒక చిన్నదో.. పెద్దదో మూమెంట్.. మరెక్కడో జరిగే మరో మూమెంట్‌కు కారణమవుతుంది. మొత్తానికి ఈ రూ.2 వేల నోటు రద్దుకు తెలంగాణకు లింక్ ఉందని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరి ఆ లింకేంటి? నిజంగానే కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? అదే నిజమైతే కారణమేంటి? వంటి అంశాలపై ప్రత్యేక కథనం.

ఎన్నికలకు అయ్యే ఖర్చు అంతా భరించటానికి సిద్ధం..
రూ.2 వేల నోటు రద్దని ఆర్‌బీఐ ప్రకటించిన వెంటనే జనాల్లో పెద్ద ఎత్తున సాగిన చర్చ ఏంటంటే.. ఈ నిర్ణయానికి తెలంగాణకు లింక్ ఉందని. కేవలం తెలంగాణ ఎన్నికలను టార్గెట్ చేస్తూ ముందుగా స్థానిక ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలనే కృతనిశ్చయంతో ఈ నిర్ణయం మోదీ తీసుకున్నారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మనం కాస్త ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనను ప్రతిపక్ష కూటమికి నాయకుడిని చేస్తే..
2024 ఎన్నికలకు అయ్యే ఖర్చు అంతా తాను భరించటానికి సిద్ధమని కేసీఆర్ చెప్పారంటూ బాంబ్ పేల్చారు. ఇది రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్నే రేపింది. ఇప్పుడు ఇదే టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. కేవలం కేసీఆర్‌ను కట్టడి చేసేందుకే మోదీ రెండు వేల నోటును వెనక్కి తీసుకున్నారని చర్చ జరుగుతోంది.

డబ్బు దొరక్కుండా చేయడానికేనా?
కేసీఆర్‌కు షాక్ ఇచ్చి.. బీఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు.. ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ దెబ్బతినడం.. అలాగే తెలంగాణలోనూ పరిస్థితులు మారిపోవడంతో ముందుగా కేసీఆర్‌ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పని చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్‌తో పాటు ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలకు డబ్బు దొరక్కుండా చేయడానికి ఇలాంటి ప్రకటన చేసి ఉంటారనే అనుమానాలు జనాల నుంచి వ్యక్తమవుతున్నాయి. నిజానికి రెండు వేల రూపాయల నోటు రద్దు విషయంపై చర్చ ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ సడెన్‌గా రాష్ట్రాల ఎన్నికల ముందు ప్రకటించడమే.. అనుమానాలకు కారణమవుతోంది. మొత్తానికి రూ.2 వేల నోటు వెనుక ముఖ్యంగా రాజకీయ కారణాలు ఉన్నాయన్నది చాలామంది వాదన.

కేసీఆర్‌ను ఆర్థికంగా దెబ్బ గొట్టారా?
తెలంగాణలోనూ వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. పైగా కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో దేశ వ్యాప్తంగా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర మీద కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా డబ్బు ఖర్చు పెట్టేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీని తొక్కేసిందుకు కేసీఆర్ అస్త్ర శస్త్రాలన్నీ సిద్ధం చేసినట్టు టాక్ నడుస్తోంది. నిజానికి తెలంగాణపై బీజేపీకి మంచి పట్టే ఉంది. ఒకానొక దశలో అధికారంలోకి కూడా రావొచ్చన్న టాక్ నడిచింది. ఇలాంటి తరుణంలో తెలంగాణను లైట్ తీసుకుంటే కష్టమని రూ.2 వేల నోటు బ్యాన్ చేసి కేసీఆర్‌ను ఆర్థికంగా దెబ్బ గొట్టారని టాక్ నడుస్తోంది. అలాగే ఎన్నికల తరుణంలో మిగతా పార్టీలకు షాక్ ఇచ్చేందుకు సైతం ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదీ ఏమైనా బీఆర్ఎస్‌కు మాత్రం భారీ ఝలక్ బీజేపీ ఇచ్చిందని చర్చ జరుగుతోంది.