భయట మనం మార్కెట్ కు వెళ్లినప్పుడు కివి పండు కనపడుతూ ఉంటుంది. కానీ దానిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక దాని జోలికి వెళ్లం. మార్కెట్ లో దీని ధర యాపిల్ కు సమానం. మన దేశంలో కివి సాగు అంతపెద్దగా లేదుగానీ ఎక్కువగా న్యూజిలాండ్ దేశంలో, చల్లని ప్రదేశాల్లో ద్రాక్షవలె సాగుచేస్తారు. అందుకే న్యూజిలాండ్ క్రికెటర్లను ‘కివీస్’ అంటుంటాం.

ఇందులో ఉన్న పోషకాలు, విటమిన్లు మరే పండులో కనిపించవని అంటారు శాస్త్రవేత్తలు. చూడటానికి సపోట వలె కనిపిస్తుంది కానీ గుడ్డు ఆకారంలో ఉంటుంది. కోసి చూస్తే అనేక గింజలతో నిండిన ఆకుపచ్చ, పసుపు పచ్చని గుజ్జు ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ ఆసిడ్, పీచు పదార్ధం, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. చాలా మంది దీనిని ‘వండర్ ఫ్రూట్’ అంటారు. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఈ పండు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. ఈ పండు వల్ల ఐదు ప్రయోజనాలు చేకూరతాయి.
అవి ఏంటంటే.. కివి పండు తినడం ద్వారా మీ శరీరం బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు నుంచి దూరంగా ఉంటుంది. కొవ్వు, సల్ఫర్ తక్కువగా ఉంటుంది కనుక గుండె, మధుమేహ వ్యాధిగ్రస్థులు తినవచ్చు. బరువు తగ్గించుకోవాలనుకొనేవారు కివి తింటే ఫలితం కనిపిస్తుంది. కివి తిన్నవారిలో శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రమాదం తక్కువ. కివి పండులో లుయిటిన్ పదార్ధం (పండు తొక్కలో) ఉంటుంది. ఇది కంటి చూపును కాపాడుతుంది. కివి పండు నుంచి తీసిన రసము చర్మ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ప్రతిరోజూ కివి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య కూడా నయమవుతుంది. డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. పండులోని ‘ఐనోసిటాల్’ పదార్ధం, మనోవ్యాకులత చికిత్సకు సహాయపడుతుంది. విరోచనకారిగా, జీర్ణక్రియను వేగవంతం చేయడంలో తోడ్పడుతుంది కివి పండు.




























