Krishna Vamsi : కృష్ణవంశీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడు. తన తొలి చిత్రం గులాబీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆంధ్రా టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తెలుగు సినిమాకు క్రొత్త ఒరవడిని పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేయక ముందు కొన్నాళ్ళపాటు త్రిపురనేని వరప్రసాద్ అనే దర్శకుడి దగ్గర సహాయకుడిగా ఉన్నాడు. వర్మ వద్ద చేరిన తరువాత కొన్నాళ్ళకు అనగనగా ఒక రోజు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించినా బడ్జెట్ పరిధి దాటిపోతుండడంతో అతడిని ఆ బాధ్యత నుండి తప్పించడం జరిగింది.

కానీ ఆయన ప్రతిభను గమనించిన వర్మ కార్పొరేషన్ బ్యానర్లోనే గులాబి అనే చిత్రంతో మరో అవకాశం వచ్చింది. వర్మ శిష్యులు వర్మ పద్ధతిలోనే చిత్రాలు తీస్తారన్న అపప్రధను చెరిపేసినవాడు కృష్ణవంశీ. కేవలం గులాబీ చిత్రంలోని పాటల చిత్రీకరణ చూసి, అతనికి అక్కినేని నాగార్జున రెండవ చిత్రానికి అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా పేరు “నిన్నే పెళ్ళాడుతా”. ఈ సినిమాలో నాగార్జున, టబు హీరో హీరోయిన్లుగా నటించారు. మంచి పాటలు, కథ కథనంతో సినిమా సూపర్ హిట్ అయింది. తరువాత కృష్ణవంశీ స్వయంగా సినీ నిర్మాణం చేపట్టి ‘ఆంధ్రా టాకీస్’ సంస్థను ప్రారంభించాడు. నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి హీరో, హీరోయిన్లుగా “సింధూరం” చిత్రాన్ని రూపొందించారు. స్టార్స్ లేకపోయినప్పటికీ ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా,ఆర్థికంగా క్రుంగదీసింది.

ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్ట లేకపోయింది. అయితే కృష్ణవంశీ ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో. మాట్లాడుతూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న బ్రహ్మాజీని సింధూరం చిత్రంలో పెట్టుకోవడం గురించి యాంకర్ అడగగా.. నేను సినిమా అవకాశాల కోసం సినీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న కొత్తలో.. అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇంటినుంచి పంపిన డబ్బులు సిటీలో నా తిరుగుడుకు ఎప్పుడో అయిపోయేవి. అలా ఒక్కో నెలలో పస్తులున్న సందర్భాలు కూడా ఉన్నాయి.కానీ ఒకరోజు.. ఖాళీ కడుపుతో ఉన్నాను. స్వతహాగా నా మనస్తత్వం ఎలాంటిది అంటే నేను ఆకలిగా ఉన్న ఎవరైనా భోజనం చేశారా అని అడిగితే చేశానని చెప్పే రకం. అలా ఓ రోజు బ్రహ్మాజీ నా దగ్గరకు వచ్చి భోజనం చేసావా అని అడిగాడు. దానికి నేను అంత ఆకలిగా ఉన్న భోజనం చేశానని చెప్పాను. ఎందుకంటే బ్రహ్మాజీ నాకు పెట్టే భోజనంతో అయనా మరొక రోజు తినేయొచ్చు.

అతను కూడా నెలకు సరిపడా డబ్బులే తెచ్చుకునే వాడు. అలాంటిది నేను అతన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని భోజనం చేశానని చెప్పాను. అయినా ఊరుకోకుండా బ్రహ్మాజీ నాకు భోజనం పెట్టించాడు. నిజంగా ఆరోజు గనక బ్రహ్మాజీ నా పరిస్థితిని అర్థం చేసుకొని భోజనం పెట్టియ్యకపోయుంటే మరో ఐదు నిమిషాల్లో కళ్ళు తిరిగి కింద పడేవాన్ని… అందుకనే ఆ రుణం తీర్చుకోవడం కోసమే సింధూరం చిత్రంలో బ్రహ్మాజీకి అలాంటి పాత్ర ఇచ్చారా? అని యాంకర్ అడగగా.. రుణం తీర్చుకోవడం కోసం కాదు. పాత్రకు సరిపోతాడనిపించింది. మీరన్నట్టుగా స్టార్ తో తీస్తే డబ్బులు వస్తాయి కానీ బ్రహ్మాజీతో తీస్తే సంతృప్తి వస్తుంది. సహాయం పొందడం కాదు ప్రతి మనిషి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలని క్లియర్ కట్ గా చెప్తూ… ఆ ఇంటర్వ్యూలో అప్పటి జ్ఞాపకాలను కృష్ణవంశీ గుర్తు చేసుకున్నారు.
































