Krishna Vamsi : పసుపులేటి కృష్ణవంశీ దర్శకుడు. రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడు. తన తొలి చిత్రం గులాబీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2000వ సంవత్సరంలో ఆంధ్రా టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. నటి రమ్యకృష్ణను పెళ్ళి చేసుకున్నాడు.
జీవిత భాగస్వామి రమ్య కృష్ణ, పిల్లలు రిత్విక్ తోడుగా ఉన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణవంశీ సృజనాత్మక దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాకు క్రొత్త ఒరవడిని పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేయక ముందు కొన్నాళ్ళపాటు త్రిపురనేని వరప్రసాద్ అనే దర్శకుడి దగ్గర సహాయకుడిగా ఉన్నాడు. వర్మ వద్ద చేరిన తరువాత కొన్నాళ్ళకు అనగనగా ఒక రోజు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించినా బడ్జెట్ పరిధి దాటిపోతుండడంతో అతడిని ఆ బాధ్యత నుండి తప్పించడం జరిగింది. కానీ ఆయన ప్రతిభను గమనించిన వర్మ కార్పొరేషన్ బ్యానర్లోనే గులాబి అనే చిత్రంతో మరో అవకాశం వచ్చింది. వర్మ శిష్యులు వర్మ పద్ధతిలోనే చిత్రాలు తీస్తారన్న అపప్రధను చెరిపేసినవాడు కృష్ణవంశీ. కేవలం గులాబీ చిత్రంలోని పాటల చిత్రీకరణ చూసి, అతనికి అక్కినేని నాగార్జున రెండవ చిత్రానికి అవకాశం ఇచ్చాడు.

హిందీలో సల్మాన్ ఖాన్ మాధురి దీక్షిత్ హీరో హీరోయిన్లుగా “హమ్ ఆప్ కె హై కౌన్” అనే చిత్రం విడుదలైంది. ఆ సినిమా చూసి ప్రేరణ పొందిన కృష్ణవంశీ. అలాంటి షేడ్స్ ఉన్న ఒక కథతో సినిమా తీయాలనుకున్నారు. ఆ సినిమా పేరు “నిన్నే పెళ్ళాడుతా”. ఈ సినిమాలో నాగార్జున, టబు హీరో హీరోయిన్లుగా నటించారు. మంచి పాటలు, కథ కథనంతో సినిమా సూపర్ హిట్ అయింది. తరువాత కృష్ణవంశీ స్వయంగా సినీ నిర్మాణం చేపట్టి ‘ఆంధ్రా టాకీస్’ సంస్థను ప్రారంభించాడు. నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి హీరో, హీరోయిన్లుగా “సింధూరం” చిత్రాన్ని రూపొందించారు. స్టార్స్ లేకపోయినప్పటికీ ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా, ఆర్థికంగా క్రుంగదీసింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్ట లేకపోయింది.

ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చడానికి జగపతిబాబు, సాక్షిశివానంద్, శ్రీహరి, శివాజీ లాంటి ముఖ్య పాత్రలతో “సముద్రం” సినిమా రూపొందించారు. ఈ సినిమాలో నటించిన తనికెళ్ల భరణికి ఉత్తమ ప్రతి కథానాయకుడిగా అవార్డు పొందారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. గులాబీ, నిన్నే పెళ్ళాడుతా లాంటి చిత్రాల లాభాలను సింధూరం, సముద్రం చిత్రాలు తీసుకురాలేకపోయాయి. ఆ రెండు సినిమాల ప్రభావం తన సినీ జీవితంపై పడిందని స్వయంగా కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలలో చెప్పారు.

































