మీడియా జర్నలిస్టుల గురించి తాను మాట్లాడిన ఓ ఆడియో టేప్ బయటకు లీక్ కావడంతో ప్రముఖ సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు ఖుష్బూ ట్విటర్ వేదికగా మీడియా గురించి స్పందిస్తూ.. ప్రెస్ అంటే నాకు చాలా అభిమానం, గౌరవం ఉన్నాయి. 34 ఏళ్ల నా కెరీర్లో నేనెప్పుడూ జర్నలిస్టులపై వివాదస్పదమైన వ్యాఖ్యలు చేయడం గానీ, అమర్యాదగా ప్రవర్తించడం గానీ చేయలేదు. నా వాయిస్ ఆడియో ఫైల్ సగమే ఉంది. ఈ విషయంలో మీడియా వాళ్లు ఏమైనా బాధపడితే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అని ట్వీట్లో పేర్కొన్నారు.

ఇంతకీ ఈ ఆడియో టేప్ లీకై ఇంత దుమారం ఎందుకు లేపిందంటే.. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో త్వరలో బుల్లితెర, వెండితెర షూటింగ్స్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఖుష్బూ ఓ ఆడియో పెట్టారు. ‘ప్రస్తుతం మీడియా వాళ్లకి కరోనా కోసం కాకుండా రాయడానికి వాళ్ళ దగ్గర మేటరేమీ లేదు. షూటింగ్స్ ప్రారంభం కాగానే వాళ్ల దృష్టి మనపైన పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫొటోలు, వీడియోలకు అనుమతి ఇవ్వకండి’ అని ఖుష్బూ మాట్లాడిన ఆడియో బయటకు లీకైంది. దాంతో ఈ వివాదం వైరల్గా మారింది.

విషయం తెలుసుకున్న ఖుష్బూ చివరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. ‘ప్రెస్ వాళ్ల కోసం నేను మాట్లాడిన ఓ ఆడియో నిర్మాతల గ్రూప్ నుంచి బయటకు లీక్ అయ్యింది. మన మధ్య ఇలాంటి మనుషులు ఉన్నారని చెప్పడానికి నేను బాధపడుతున్నాను. ప్రెస్ను కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. మన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతామో అలాగే ప్రెస్ గురించి మాట్లాడాను. జర్నలిస్టులపై నాకున్న గౌరవం అందరికీ తెలిసిందే. ‘మీరు ఎవరి కోసమైతే కష్టపడతారో వాళ్లే మీ వెనుక గోతులు తవ్వుతున్నారని తెలిస్తే మీకెంత బాధాగా ఉంటుంది. నా ఆడియో టేప్ని ఏ నిర్మాత బయటకు లీక్ చేశారో నాకు తెలుసు. కానీ వాళ్ల పేరును నేనిప్పుడప్పుడే బయట పెట్టను. నా నిశ్శబ్దం, క్షమాగుణమే వారికి అతిపెద్ద శిక్ష’ అని ఖుష్బూ ఈ సందర్భంగా తెలియజేశారు.



























