ఆ దేశం పేరుకు సంపన్న దేశం. గతంలో ఇతర దేశాలకు సైతం సహాయం చేసే స్థితిలో ఉండేది. సంపన్న దేశంగా ఆ దేశానికి ఉండే పేరుప్రఖ్యాతలు అన్నీఇన్నీ కావు. అయితే ఇదంతా గత చరిత్ర. ప్రస్తుతం ఆ దేశం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఓడలు బండ్లవుతాయనే బండ్లు ఓడలవుతాయనే సామెతను నిజం చేసింది. ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటైన కువైట్ ప్రస్తుతం దారుణ పరిస్థితులను అనుభవిస్తూ ఉండటం గమనార్హం.

ఇదంతా గడిచిన కొన్ని నెలల్లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా, అడ్డూఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి కువైట్ ఆర్థిక ఇబ్బందులకు కారణమైంది. కువైట్ అత్యంత సంపన్న దేశంగా ఎదగడానికి కారణం ముడిచమురు. ఆ దేశ ఆదాయంలో 90 శాతం ఆదాయం ముడిచమురు వల్లే వస్తుంది. అయితే కరోనా మహమ్మారి విజృంభణ వల్ల పలు దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి.
లాక్ డౌన్ అమలు వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం భారీగా తగ్గింది. దీంతో కువైట్ సర్కార్ ఆదాయం పెంచుకోవడం కొరకు ఇతర మార్గాలను అన్వేషించింది. అయితే ఆ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇవ్వలేదు. అక్కడి ప్రభుత్వం, పార్లమెంట్ మధ్య ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రుణ చట్టం గురించి రగడ జరుగుతోంది. కువైట్ సర్కార్ ఎలాగైనా ఈ చట్టాన్ని అమలు చేయాలని భావిస్తోంది.
కొత్త రుణ చట్టం అమలు వల్ల ఆ దేశం ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు 46 బిలియన్ డాలర్లను కరోనా వల్ల కువైట్ కోల్పోయిందని సమాచారం. ప్రపంచమంతా సాధారణ పరిస్థితులు ఏర్పడితే కువైట్ ఆర్థికంగా కోలుకునే అవకాశం ఉంటుంది. గతంలో బాండ్ల ద్వారా నిధులను సమీకరించుకున్న కువైట్ ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది.



























