బాలయ్య మాస్ చిత్రాలు అనగానే రౌడీ ఇన్స్పెక్టర్, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు గుర్తుకువస్తాయి. కానీ వీటి కంటే ముందే ఒక ఊర మాస్ చిత్రంలో ఆయన కనిపించారు. అప్పటికి(1990) బాలయ్యకు హిట్, సూపర్ హిట్ చిత్రాలు కొత్తవేమీ కాదు. అయినా ఎక్కడో మాస్ అనే పాత్ర బాలయ్య బాబుకు గట్టిగా తగల్లేదేమో అనిపిస్తుంది. ఆ క్రమంలో మాస్ కా బాస్.. నందమూరి నటసింహం బాలయ్య ఓ మాస్ చిత్రంతో అభిమానులను సందడి చేశారు.

స్టేట్ రౌడీ చిత్రం ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా తెలుగు సినీ ప్రముఖుల దృష్టిని దర్శకుడు బి.గోపాల్ ఆకర్షించారు. అలా ప్రముఖ నటుడు రావుగోపాల్ రావు, దర్శకుడు బి.గోపాల్ ను సంప్రదించి ఆయన దర్శకత్వంలో సినిమా నిర్మించాలనుకున్నారు. ఆ క్రమంలో ఈ దర్శకుడి డేట్స్ దొరకడం.. అలానే అందుకు తగిన విధంగా స్టార్ హీరో కూడా ఉండాలని బాలయ్య బాబుని సంప్రదించారు. బి.గోపాల్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి బాలయ్య ఒప్పుకున్నారు. బాలయ్యతో సినిమా రూపొందించాలంటే కథ కూడా అంతే బలంగా ఉండాలి. కథ కోసం పరుచూరి బ్రదర్స్ ను సంప్రదించడంతో నిప్పురవ్వ, వంశానికొక్కడు చిత్రాలకి సంబంధించిన కథను చెప్పారు. ఎందుకనో బి.గోపాల్ ఆ కథల పట్ల అంతగా స్పందించలేకపోయారు.

అప్పటికే పరుచూరిబ్రదర్స్ బిజీ కావడంతో కథ వేరే చూసుకోండి అవసరమైతే మేము ఈ సినిమాకి మాటలు రాస్తామని చెప్పారు. లోగడ పుష్పానంద్ అందించిన కథతో సినిమాలు రూపొందించిన బి.గోపాల్.. తిరిగి బాలయ్యతో రూపొందించే చిత్రానికి కథ కోసం తిరిగి పుష్పానంద్ ను సంప్రదించడం జరిగింది. అలా రచయిత పుష్పానంద్ అందించిన కథ బాలయ్య, బి.గోపాల్ కు నచ్చడంతో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. బాలయ్యకు జోడిగా హీరోయిన్ ఎవరా? అని ఆలోచించగా.. బాలయ్య విజయశాంతిలది అప్పటికే సూపర్ హిట్ కాంబినేషన్. కానీ ఆమె కర్తవ్యం షూటింగ్ తో బిజీగా ఉన్నారు. బాలయ్యతో సినిమా అనగానే విజయశాంతి తన డేట్స్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే కర్తవ్యం విడుదలై మంచి టాక్ తో ముందుకు పోతోంది. అలా “లారీడ్రైవర్” చిత్రంలో విజయశాంతికి సంబంధించిన పాత్రను ఇంకాస్త పెంచడం జరిగింది.

ఇక పోతే ప్రతి కథానాయకుడిగా మోహన్ రాజ్ బాలయ్యకు దీటుగా నటించారు. ఒక సన్నివేశంలో మోహన్ రాజు “నేను గుడివాడ రాయుడు అనగానే నువ్వు రాయుడు కాదు గుడివాడ రౌడీవని బాలయ్య చెప్పడంతో.. బాలయ్య అభిమానుల చప్పట్లతో థియేటర్ మొత్తం దద్దరిల్లింది. అలాగే శారదా, విజయ్ కుమార్, బాబుమోహన్ లాంటివారు ప్రధాన పాత్రలో కనిపించారు. హైదరాబాద్, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలో లారీ డ్రైవర్ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రానికి సంగీతం ఆయువు పట్టని చెప్పవచ్చు. 1990 వచ్చేసరికి దాదాపుగా చక్రవర్తి వెనుకబడ్డారు అనే టాక్ నడుస్తుంది. అయినా దర్శక, నిర్మాతలు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రవర్తినే తీసుకున్నారు. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి చాలా శ్రద్ధగా కష్టపడి బాణీలు రూపొందించారు.

“బాలయ్య బాలయ్య.. గుండెల్లో గోలయ్య… జో కొట్టాలయ్య..” అలాగే “దసరా వచ్చిందయ్య… సరదా తెచ్చిందయా… దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్య…జయహో దుర్గా భవాని..హోయ్.! అనే పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ విషయానికొస్తే 120 థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి వారంలో కోటి రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. 42 కేంద్రాలలో డైరెక్టర్ గా 50 రోజులు ఆడింది. చాలా సినిమాల విడుదల కోసం లారీడ్రైవర్ మూవీనీ తీసివేయడం వలన 8 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి ఐదు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. చాలా బి సి సెంటర్స్ లో మొదటి 50 రోజులు ప్రదర్శింపబడి వాటిని వెలుగులోకి తెచ్చి తొలి మాస్ జాతర చేసింది లారీ డ్రైవర్ చిత్రం.































