ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కొనసాగుతున్న రెండు క్రిమినల్ కేసులపై తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఈ కేసులు 2018లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించినవి. అప్పట్లో విడుదలైన ‘GST (గాడ్, సెక్స్ అండ్ ట్రూత్)’ షార్ట్ ఫిల్మ్‌పై తీవ్ర వివాదం చెలరేగింది. మహిళలను అవమానించేలా ఉన్నాయనే ఆరోపణలతో పలు మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆ సమయంలో వర్మ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి.
ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు IPC సెక్షన్లు 354ఏ, 504, 506, 509తో పాటు ఐటీ చట్టం 67 కింద కేసులు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు కూడా దాఖలు చేశారు. నాంపల్లి కోర్టులో కేసులు కొనసాగుతుండగా, వాటిని రద్దు చేయాలంటూ వర్మ తరఫు హైకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్ రావు ఈ పిటిషన్లపై విచారణ జరిపారు. వర్మ తరఫు న్యాయవాది వాదనలు విన్న అనంతరం, దిగువ కోర్టు విచారణపై స్టే విధిస్తూ పోలీసులతో పాటు ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 2026కి వాయిదా వేశారు. దీంతో వర్మకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లైంది.































