పేదల పాలిట పెన్నిధిగా ఆపదలో అందరికీ సహాయం చేస్తూ వెండితెరపై విలన్ గా నటించే సోనూసూద్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఈమధ్య కరోనా లాక్ డౌన్ టైంలో వలస కూలీల కోసం ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేసి అందరి మన్ననలు అందుకున్న సోనూసూద్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ పేద కుటుంబానికి సహాయం చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కూతుళ్లతో నాగలి పట్టించిన రైతుకు అండగా నిలిచి ట్రాక్టర్ కొనిచ్చాడు సోనూసూద్.

అయితే ఈవిధంగా సహాయం చేసేముందు వాళ్ళు నిజంగానే ధీనస్థితిలో వున్నారా.. లేదా..? అనే విషయాన్ని కాస్త విచారించుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెట్టడంతో సోనూసూద్ చేసిన పని కాస్త విమర్శలకు గురవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కంభం వారి పల్లె మండలం మహల్ రాజపల్లికి చెందిన రైతు వీరదల్లు నాగేశ్వరరావు ఆర్ధికంగా వెనుకబడిన రైతేం కాదు.. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నాయకునిగా గతంలో పని చేశారు. కమ్యునిస్ట్ ఉద్యమాలలో పాల్గొని మావోయిస్టుల హక్కులపై పోరాడారు. ఇతనికి సొంత ఇల్లు ఉంది. సొంత ఊరిలోనే సమాజం కోసం పోరాటం చేసే వ్యక్తిగా మంచి పలుకుబడి కూడా సంపాదించారు. ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. లేటెస్టుగా సోనూసూద్ నుంచి ట్రాక్టర్ సహాయం పొందిన ఈ రైతు లోక్ సత్తా పార్టీ తరపున గతంలో ఆ ఊరి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. ఇతను ఉండేది మదనపల్లె పట్టణంలో.. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా పల్లెటూర్లో వుండడమే మంచిదని ఈమధ్యనే సొంతూరు మహల్ రాజపల్లి వచ్చేశారు.

వీరదల్లు నాగేశ్వరరావు పేరుకు మాత్రమే రైతు. కానీ., ఏడాది మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే వ్యక్తి మాత్రం కాదు. పొలం దుక్కి దున్నటానికి ఆ టైంలో ట్రాక్టర్లు, కూలీలు అందుబాటులో లేక తన కూతుళ్లతో సరదాగా ఇలా చేశాడే కానీ డబ్బులు లేక ధీనస్థితిలో ఉండి మాత్రం ఈ పని చేయలేదు. మరొక్క ఆసక్తికరమైన విషయమేమిటంటే.. నాగేశ్వరరావుకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అన్ని పథకాల కింద ఆర్థిక సహాయం అందుతుంది. పోయిన సంవత్సరం రైతు భరోసా పధకం కింద రూ. 13వేల 500 నాగేశ్వరరావు బ్యాంకు ఎకౌంట్ లో జమయ్యాయి. ఈ సంవత్సరం కూడా రైతు భరోసా పధకం కింద రూ.7వేల 500 అందుకున్నారు. అలాగే తన చిన్న కూతురుకు జగనన్న అమ్మ ఒడి పధకం క్రింద రూ.15 వేల రూపాయలు అందుకున్నారని తెలిసింది.

నాగేశ్వరరావు తల్లి కూడా అభయ హస్తం కింద పెన్షన్‌ తీసుకుంటుంది. కరోనా టైంలో ప్రభుత్వం అందించిన వెయ్యి రూపాయల ఆర్థిక సాయం కూడా అందుకుంది. తన రెండెకరాల పొలంలో వేరు శెనగ పంట వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి DAP ఎరువులు, విత్తనాలను కూడా తీసుకున్నారు. కరోనా ప్రభావంతో అద్దెకు ట్రాక్టరు దొరక్క. కూలీలు అందుబాటులో లేక కుమార్తెల సహాయంతో పొలం దున్నుతున్న రైతు నాగేశ్వరరావు వివరాలను ఓ పత్రిక ప్రచురించింది. కానీ ఆ పత్రిక ప్రచురించిన వార్తలో ఎక్కడా ఆ రైతు కుటుంబం డబ్బుల్లేక.. ధీనావస్ధలో వున్నారని లేకపోవడం విశేషం. వాళ్ళు పొలం దున్నే సమయానికి ట్రాక్టర్ అందుబాటులో వున్నా.. లేక పని చేసే కూలీలు దొరికినా డబ్బులిచ్చే స్థోమత నాగేశ్వరరావుకి ఉంది. ఇదిలా వుండగా.. తాజాగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే స్పందించినట్లు చిత్తూరు జిల్లా అధికారులు తెలియజేస్తూ..

ఆ రైతు గ్రామానికి స్వయంగా వెళ్లి అతన్ని ఆరా తీశామని, కేవలం సరదాగానే తన కూతుళ్ళతో పొలం దున్నించినట్లు రైతు వివరించారని, ఈలోపు అతని కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలను గ్రామ వాలంటీర్ ద్వారా కూడా సేకరించామని, డబ్బున్న కుటుంబమేనని తెలియడంతో ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించలేదని తెలిపారు. ఈ వివరాలన్నీ కూడా ది హిందూ పత్రిక కూడా ప్రత్యేక కధనంగా ప్రచురించింది. అయితే ఇంకాస్త అడ్వాన్స్ గా సోనూసుద్ ట్విట్ చేయటం… అతను స్పందించటం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఫైనల్ గా గతంలో లోక్ సత్తా పార్టీ తరపున ఆ ఊరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రైతు నాగేశ్వరరావు ఇప్పుడు ఆ ట్రాక్టర్‌ను వెనక్కిచ్చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here