మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? అసలే వేసవి కాలంలో తియ్యని మామిడి పండ్లు నోరూరుతూ ఉంటాయి. బంగిన పల్లి, రసాలు, మాల్గోబా, కలమామిడి ఇలా రకరకాల మామిడిపళ్ళు లొట్టలేసుకుంటూ తినే సమయం. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ ప్రభావం మామిడిపండ్ల అమ్మకాలపై కూడా పడింది. ఒక్క ముక్కైనా తింటే బాగున్ను అనిపిస్తుంది. లాక్ డౌన్ కారణంతో జనాలు బయట తిరగటమే కష్టమవుతుంది. అలాంటిది మామిడి పండ్లు ఎక్కడ దొరుకుతాయి? అని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచన చేస్తుంది.

ఫోన్ లో ఆర్డర్ చేస్తే చాలు మామిడిపళ్ళు మీ ఇంటికి డెలివరీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అవును మీరు విన్నది నిజమే మే 1 నుంచి ఫోన్ లో ఆర్డర్ చేస్తే చాలు మామిడి పండ్లను మీ ఇంటికి సరఫరా చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. లాక్ డౌన్ కారణంగా మామిడి రైతులనుంచి మామిడి పండ్లను నేరుగా వినియోగదారునికి చేర్చాలని రాష్ట్ర ఉద్యాన శాఖ, ఉద్యాన అభివృద్ధి సంస్థ నిర్ణయించాయి. ఇందుకోసం రైతుల తోట నుంచే మామిడికాయలు సేకరించి సహజ పద్దతిలో మగ్గపెట్టి 5 కిలోల చొప్పున కార్బన్ బాక్సుల్లో ప్యాక్ చేసి పంపనుంది. అయితే ఇది కేవలం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రమే పరిమితం. మరి ఇతర జిల్లాల్లో కొనసాగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

కాగా, డెలివెరి చార్జీలతో కలిపి కేవలం 350 రూపాయిలకే 5 కిలోల మామిడి పండ్లను పంపనుంది. ఇందులో ఎన్ని బాక్సులు కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. కానీ ఆర్డర్ ఇచ్చిన నాలుగైదు రోజుల్లో మామిడి పండ్ల డెలివరీ చేస్తామని ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. మామిడి పండ్లు కావాల్సిన వారు 7997724925, 7997724944 నంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్లు ఇవ్వొచ్చు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే పేమెంట్ మాత్రం 7997724925 నంబర్ కు గూగుల్ పే చేసి పూర్తి అడ్రస్, పిన్ కోడ్ తో సహా మెసేజ్ పంపి ఆర్డర్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ చేసేవారికోసం కూడా ఆంధ్రాబ్యాంక్, గగన్ మహల్ బ్రాంచ్ లోగల అకౌంట్ నంబర్ 013910100083888, ఏఎన్‌డీబీ0000139కు డబ్బులు పంపి కాపీ మెసెజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపారు. సో ఇంకేంటి ఆలస్యం ఇప్పటికే మామిడి పండ్ల మిస్ అవుతున్న వారందరూ మే 1 నుంచి ఫోన్స్ చేసి ఆర్డర్ చేసుకోండి.




























