Marriage praposals in same village : పిల్లలను పెంచి చదువు చెప్పించి వారికి పెళ్లిళ్లు చేసేవరకు తల్లిదండ్రుల బాధ్యత తీరిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో అమ్మాయి అబ్బాయి ఇద్దరూ సంపాదనలో పోటీ పడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు, కోట్లలో జీతాలు అంటూ పరుగులు పెడుతుంటే ఈ ఊర్లో మాత్రం ఎంత చదువు చదవినా అదే ఉరి సంబంధమే ఇచ్చి చేస్తారు. ఇతర ఊర్లకు జిల్లాలకు రాష్ట్రాలను సంబంధం చేసుకోరు. అసలు లోకల్ లోనే వారి పిల్లలను ఇచ్చి పెళ్లి చేయడానికి కారణాలను ఆ ఊర్లో వాళ్ళు ఏం చెబుతారో తెలుసా…

మా కళ్ళముందే ఉండాలని…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మిపురం గ్రామంలో తాతల కాలం నుండి అదే ఊర్లో వారికి ఇచ్చి పెళ్లి చేసే ఆచారం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మగ పిల్లాడైనా ఆడపిల్ల అయినా మండలం దాటి సంబంధం చేయరు. తమ పిల్లలు ఎక్కడో ఉండటం ఇష్టం లేక, కళ్ళముందు ఉండాలనే ఆశతో అక్కడి పెద్దలు ఇలా పెళ్లిళ్లు చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారులైనా, వ్యవసాయ పనులు చేసే వారైనా సరే అదే మండల పరిధిలో ఉండేవారైతే వారికే ఇచ్చి ఆడపిల్ల తండ్రి పెళ్లి చేస్తున్నారు.

ఎక్కడో విదేశాల్లో తమ పిల్లలు ఉంటూ ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో అంటూ బ్రతికేకంటే ఇలా కళ్ళముందు ఉండేలా పెళ్లి చేయడం మంచిదని భావిస్తున్నామని ఒక వ్యక్తి తెలిపారు. ఇక నేటి పరిస్థితుల్లో దూరప్రాంతపు పెళ్లిళ్లు అంటే ఎలా ఉంటున్నాయో తెలుసు, వాళ్ళ గురించి మనకు పూర్తిగా తెలియదు, అబ్బాయి జీతం విదేశాల్లో ఉంద్యోగం అంటూ ఆశపడి పెళ్లి చేస్తే కొద్దిరోజుల్లోనే పెటాకులవుతున్న ఎన్నో పెళ్లిళ్లు చూస్తున్నాం. అందుకే ఇంకా మా పెద్దల ఆచారం పాటిస్తున్నాం అంటూ అక్కడి స్థానికులు చెప్పారు.




























