ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి ఇది సాధారణ రోడ్డు ప్రమాదంలా కనిపించినా, పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

విస్సన్నపేట మండలానికి చెందిన రాజేష్, అలేఖ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం ఇద్దరూ విజయవాడ సమీపంలోని నున్న గ్రామంలో పనిచేస్తున్నారు. ఈ సమయంలో స్టేడియం నిర్వహకుడితో అలేఖ్యకు పరిచయం పెరిగి, అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన అలేఖ్య, ప్రియుడితో కలిసి అతన్ని హతమార్చే కుట్ర పన్నారు.
ఈ దారుణానికి కడప జిల్లాకు చెందిన ముగ్గురిని కిరాయికి తీసుకుని, మొత్తం రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా అడ్వాన్స్‌గా డబ్బు ఇచ్చి ప్లాన్ అమలు చేశారు. ఈ నెల 21న రాజేష్‌ను పని పేరుతో విజయవాడకు పిలిపించి, మద్యం తాగించి, అనంతరం ఇనుప రాడ్‌తో దాడి చేసి, ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.
హత్య తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కాలువలో పడేసి, దాన్ని రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తొలుత పోలీసులు కూడా ప్రమాదంగానే కేసు నమోదు చేశారు. అయితే కుటుంబ సభ్యుల అనుమానాలు, ఆందోళనలతో కేసును లోతుగా విచారించారు.
దర్యాప్తులో కీలకంగా మారింది ఒక చిన్న క్లూ—మద్యం బాటిల్‌పై ఉన్న హోలోగ్రామ్. దాని ఆధారంగా పోలీసులు నిందితుల వరకు చేరుకున్నారు. రాజేష్‌ను అక్కడే మద్యం తాగించి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ కేసులో ప్రియుడు, కిరాయి హంతకులతో పాటు ప్రధాన సూత్రధారి అలేఖ్యనేనని తేల్చి, అందరినీ అరెస్ట్ చేశారు.
ప్రేమతో పెళ్లి చేసుకున్న అలేఖ్య చివరకు భర్తను హతమార్చి జైలుపాలైంది. ఈ ఘటన కుటుంబాలను మాత్రమే కాదు, సమాజాన్నీ కలవరపరుస్తోంది.































