గత కొన్నేళ్లుగా స్టార్ హీరో రవితేజ పరిస్థితి ఏం బాగోలేదు. ఒకప్పుడు వరుస విజయాలతో జోష్ మీదున్న రవితేజకు ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. 2017లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా విడుదలైన రాజా ది గ్రేట్ రవితేజ చివరి హిట్టు సినిమా. ఈ సినిమా తరువాత రవితేజ నటించిన టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా డిజాస్టర్లు అయ్యాయి.

దీంతో రవితేజ మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయింది. జబర్దస్త్, అదిరింది లాంటి షోల వల్ల ప్రేక్షకులు సాధారణ కామెడీని ఇష్టపడడం లేదు. రవితేజకు పరాజయాలు పలకరించడానికి కథల్లో కొత్తదనం లేకపోవడం, రొటీన్ కామెడీ కారణమవుతున్నాయి. అయితే సినిమాసినిమాకు మార్కెట్ డౌన్ అవుతున్నా రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి రవితేజ మాత్రం ఇష్టపడటం లేదు. వరుస ఫ్లాపుల్లో ఉన్నా రవితేజకు అవకాశాలకు కొదవ లేదు.

ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది ప్రతిరోజూ పండగే సినిమాతో హిట్ కొట్టిన మారుతి చెప్పిన కథకు కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మారుతితో గతంలో పలు సినిమాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రవితేజకు సూట్ అయ్యే కథతో, కామెడీ మిస్ కాకుండా మారుతి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని సమాచారం.

అయితే రవితేజ ఈ సినిమాకు తీసుకోబోతున్న పారితోషికం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయంశమవుతోంది. ఈ సినిమా కోసం రవితేజ ఏకంగా 15 కోట్లు డిమాండ్ చేశాడని… యూవీ క్రియేషన్స్ సైతం అందుకు అంగీకరించిందని తెలుస్తోంది. 2021 జనవరిలో సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతుందని సమాచారం. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాలో నటిస్తున్నాడు.



























