Medical Student Preethi : కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న డాక్టర్ ప్రీతి అనే యువతి బుధవారం డ్యూటీ లో ఉండగానే హానికర ఇంజక్షన్ ను వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వరంగల్ లో మెడిసిన్ అనస్థిషియా పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులను భరించలేక ఇలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం నాడు ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయగా గురువారం నాడు పీజీ రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్ ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు ఇచ్చే డిపార్ట్మెంట్ లో డ్యూటీ నిర్వహిస్తున్న ప్రీతి అక్కడే ఉన్న ప్రమాదకర ఇంజక్షన్ ను వేసుకుంది. నిన్నటి వరకు మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరకు ఓడిపోయింది. అయితే ఆమె చివరగా డ్యూటీలో ఉన్నపుడు తల్లితో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అమ్మా భయం వేస్తోంది…
సైఫ్ తనను పర్సనల్ గా టార్గెట్ చేసాడనే విషయాన్ని కుటుంబం సభ్యులకు చెప్పిన ప్రీతి తన తండ్రితో కలిసి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు కూడా చేసింది. హెచ్ఓడి నాగార్జున రెడ్డి పిలిపించి సైఫ్ తోనూ ప్రీతి తోనూ విడిగా మాట్లాడి నేను చూసుకుంటాను అని మాటివ్వడం కూడా జరిగిందని ప్రీతి తన తల్లితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడినపుడు చెప్పింది. ఫిర్యాదు చేయడం వల్ల మరింతగా నన్ను టార్గెట్ చేస్తాడేమో అని భయమేస్తోంది అంటూ తల్లితో చెప్పడం ఆ ఆడియోలో ఉంది.

అయితే ప్రీతి తల్లి బయపడకు నువ్వు ఎక్కడో లేవు వరంగల్ లోనే ఉన్నావు, నాన్న చూసుకుంటాడు ఆ అబ్బాయి నెంబర్ నాకు ఇవ్వు నేను మాట్లాడుతా అంటూ కూతురుకి ధైర్యం చెప్పింది కానీ ప్రీతి మాత్రం అదేం వద్దు అంటూ మాట్లాడటం జరిగింది. ఇక సెకండ్ ఇయర్ లో మిగిలిన వాళ్ళు అతను ఇలా చేస్తుంటే ఏమి అడగరా, ఇలా చేయకూడదు అని చెప్పారా అంటే వాళ్ళందరూ ఒక్కటే అంటూ ప్రీతి చెప్పడం తనతో పాటు మరికొందరిని ఇబ్బంది పెడుతున్నా వాళ్లు మౌనంగా భరిస్తున్నారని ప్రీతి తల్లితో వివరించింది. ఏది ఏమైనా తల్లి ఎంతో ధైర్యం చెప్పినా ప్రీతి మాత్రం ఆత్మహత్యకు పాల్పడి ఆ తల్లికి కడుపు కోత మిగిల్చింది.



























