పెళ్లి వద్దని పారిపోయి కలెక్టర్ గా తిరిగొచ్చిన మహిళ!

0
315

మనలో చాలామందికి ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో మనం నిరంతరం కృషి చేస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో వేర్వేరు కారణాల వల్ల తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం లభించదు. ఆడపిల్లైతే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే తమ బాధ్యత తీరిపోతుందని భావించే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అటు తల్లిదండ్రుల మాటను కాదనలేక, ఇటు లక్ష్యాన్ని వదులుకోలేక కొందరు యువతులు అనుభవించే నరకయాతన అంతాఇంతా కాదు.

అయితే ఒక యువతి మాత్రం తాను పెళ్లి చేసుకుంటే లక్ష్యాన్ని సాధించలేనని భయాందోళనకు గురైంది. తల్లిదండ్రులకు ఎంత నచ్చజెప్పినా తన మాట మాత్రం వినరని భావించింది. ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకోవడంతో లక్ష్యాన్ని సాధించడం కోసం ఇంటి నుంచి పారిపోయింది. ఏడేళ్ల తర్వాత కలెక్టర్ గా ఎంపికై సొంతింటికి తిరిగి వచ్చింది. వినడానికి సినిమా స్టోరీలా ఉన్న ఈ స్టోరీ ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ కు చెందిన 28 సంవత్సరాల సంజురాణివర్మ అనే యువతి తల్లి 2013లో చనిపోయింది. దీంతో ఆమె తండ్రి పెళ్లి చేస్తే కూతురు బాధ్యత తీరిపోతుందని భావించాడు. అనుకున్నదే తడవుగా పెళ్లి సంబంధం చూశాడు. దీంతో సంజురాణివర్మ ఇంటి నుంచి పారిపోయింది. ఇంట్లో నుంచి పారిపోయిన సంజు పీజీ పూర్తి చేసి యూపీఎస్సీ పరీక్షలు రాసి కలెక్టర్ గా ఎంపికై నేటి యువతకు రోల్ మోడల్ గా నిలిచింది.
 
అయితే ఏడేళ్ల ప్రయాణంలో సంజు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఖర్చుల కొరకు ప్రైవేట్ ఉద్యోగం చేయడంతో పాటు పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని సాధించడం కోసం వెనుకడుగు వేయకుండా శ్రమించింది. అమ్మాయిలకు స్వేచ్ఛను ఇస్తే వాళ్లు ఉన్నత స్థానాలకు ఎదుగుతారని…. అమ్మాయిలను చదువుకోనివ్వకుండా పెళ్లి పేరుతో ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here