మీరు కామెడీ బాగా చేస్తారా.? అందర్నీ కడుపుబ్బా నవ్విస్తూ పొట్ట చెక్కలు చేయడం మీ అలవాటా.? మీరూ కూడా జబర్దస్త్ లాంటి ఖతర్నాక్ కామెడీ షోలో స్క్రిప్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారా.? అయితే మరెందుకు ఆలస్యం.. జబర్దస్త్ జడ్జీ, మెగా బ్రదర్ నాగబాబు ఇలాంటి అప్ కమింగ్ టాలెంటెడ్ కమెడియన్స్ కోసమే ఓ అదిరిపోయే గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నారు. అతిత్వరలోనే 2 కామెడీ షోలను ప్రారంభిస్తున్నట్టు ఈమధ్యనే తన యూ ట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియోను విడదల చేశారు నాగబాబు. ఆ వీడియోలో క్రొత్తగా ప్రారంభించబోయే 2 కామెడీ షోల వివరాలను ప్రేక్షకులకు తెలియజేశారు.

వివరాల్లోకి వెళ్తే.. నాగబాబు మాట్లాడుతూ.. త్వరలోనే 2 కామెడీ షోలను ప్రారంభిస్తున్నాను. చాలా మంది మాలో ప్రతిభ వుంది. కానీ మాకు అవకాశాలు రాక.. ఇచ్చేవాళ్ళు లేక పైకి రాలేకపోతున్నాం.. అదిరింది, జబర్దస్త్ లాంటి కామెడీ షోలలో పాల్గొనాలంటే మాకు ఎంట్రీ దొరకడం లేదు అని బాధపడేవారికి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను.. మీకు నవ్వించే సత్తా ఉందా?? పొట్ట చెక్కలు చేసేంత దమ్ముందా?? నాలాంటి వాళ్లను నవ్వించగలిగే సత్తా మీకుంటే ఈ గోల్డెన్ ఆఫర్ మీకోసమే. మేం 2 రకాల షోస్ ను ప్లాన్ చేస్తున్నాం. మొదటి షోలో స్కిట్స్ లాంటివి చేసుకోవచ్చు. అందరూ జబర్దస్త్, అదిరింది లాంటి షోలకు వెళ్లలేకపోవచ్చు కాని.. యూ ట్యూబ్‌లో కూడా చాలా మంది మంచి మంచి స్కిట్‌లు చేస్తున్నారు. అలాంటి స్కిట్స్ మీరు మొదటి షోలో చేయొచ్చు. ఇక 2వది.. స్టాండప్ కామెడీ కాంపిటేషన్. ప్రపంచంలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు.
అలాగే హిందీ, తమిళ, కన్నడలో కూడా చాలా మంది స్టాండప్ కమెడియన్స్ చూశాను. కాని తెలుగులో ఆ స్థాయి కమెడియన్స్ ను నేను చూడలేదు. అందుకే ఈ స్టాండప్ కామెడీ కాంపిటేషన్. సో.. త్వరలోనే నాగబాబు యూట్యూబ్ ఛానల్ లో 2 న్యూ అప్డేట్స్ వస్తాయి. ఇద్దరు పాపులర్ కమెడియన్స్ ద్వారా ఈ అప్డేట్స్ ఇవ్వబోతున్నాం. ఇందులో ఏం చేయాలి.. ఎలా చేయాలి.? అనేది వాళ్లు అనౌన్స్ చేస్తారు. నిజంగా మీరు ఈ పోటీలో పాల్గొని విజేతలైతే మీకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో పెర్ఫామ్ చేసే ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ రావాలంటే ముందు మీరు ఈ పోటీలలో పాల్గొనాలి. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే కాంపిటేటర్స్ ఎలాంటి ఎంట్రీ ఫీజు కట్టనవసరం లేదు. మీరు ఈ కాంపిటేషన్ లో పాల్గొని మీ సత్తా చూపించండి చాలు. ఇది నిజంగానే గోల్డెన్ ఛాన్స్ అని నా అభిప్రాయం’ అంటూ తన కొత్త కామెడీ షోల అప్డేట్స్ ను అందించారు నాగబాబు.




























