న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి అప్రత్యాశితంగా రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో వైద్యుల సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా, ఆమె వెంటనే ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందంటూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. 2022 ఆగస్టు 11న ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవంగా ఆయన పదవీకాలం 2027 ఆగస్టు వరకు ఉండాల్సి ఉంది. కానీ ముందస్తుగా పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు?: ఢిల్లీలో జోరుగా చర్చ
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరు వస్తారు? ఈ అంశంపై ఢిల్లీలో బిజీగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కీలక నాయకుల పేర్లు తెరపైకి వచ్చాయి.
- నితీష్ కుమార్ (బీహార్ ముఖ్యమంత్రి): బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరును బీజేపీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆయనను ఢిల్లీకి పంపి బీహార్ అసెంబ్లీపై పట్టుకట్టాలన్నది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది.
- హరివంశ్ నారాయణ్ సింగ్ (రాజ్యసభ ఉప సభాపతి): అదే సమయంలో బీహార్ నుంచే రాజ్యసభ ఉప సభాపతి హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు కూడా వినిపిస్తోంది.
- రాజ్‌నాథ్ సింగ్ (కేంద్ర రక్షణ మంత్రి): ఇక ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.
- శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ, కేరళ): దక్షిణాదిలో ప్రముఖంగా కేరళ నుంచి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేరు కూడా ప్రచారంలో ఉంది.
మెగాస్టార్ చిరంజీవి పేరు: ఊహాగానాల్లో ముందు వరుసలో
అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు మాత్రం మెగాస్టార్ చిరంజీవి. మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు చిరంజీవి పేరు ఊహాగానాల్లో ముందుగా నిలుస్తోంది. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, బీజేపీ – జనసేన మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు చిరు వంటి బహుళ ప్రజాదరణ ఉన్న నేతను ఉపరాష్ట్రపతి పీఠానికి ప్రతిపాదించే యోచన ఉందని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ క్రేజ్ ను దక్షిణాదిలో వాడుకునేందుకు ఇది బీజేపీ వ్యూహంగా చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే విశ్వంభర అనే భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా లైనప్‌లో కొన్ని సినిమాలు ఉన్నప్పటికీ, కేంద్ర స్థాయిలో పౌర రాజ్యాంగ హోదా లాంటి కీలక పదవి చిరు ఒప్పుకుంటారో లేదో అనేది ఆసక్తికరమైన విషయం. చిరంజీవి వైపు బీజేపీ చూపు తిప్పినట్లు కొన్ని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిస్తే, దక్షిణాదిలో బీజేపీకి ప్రత్యేక శక్తినిచ్చే అవకాశముంది.
రాజకీయ సమీకరణాలకు దిక్సూచి
ఈ నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో కేంద్రం తీసుకోబోయే నిర్ణయం, ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నిర్ధేశించబోయే అభ్యర్థి పేరే రాజకీయ సమీకరణాలకు దిక్సూచిగా మారబోతోంది.



































