Mimicry Murthy : ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో చాలా విషాదాలు చోటు చేసుకున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఏ క్షణాన ఎవ్వరి జీవితం ఏమవుతుందో ఊహించడానికి వీలు లేకుండా పోయింది. ఇండస్ట్రీ ఈమధ్య చాలా మంది నటులను కోల్పోయింది. తాజాగా తెలుగు తెలివిజన్ పరిశ్రమలో విషాదం నెలకొంది. మిమిక్రీ ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందిన మూర్తి చనిపోయారు. దీంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్యాంక్రియాస్ క్యాన్సర్ కారణంగా తీవ్ర అనారోగ్యంతో మృతి…
జబర్దస్త్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన కమెడియన్ మూర్తి మంగళవారం మధ్యాహ్నం కన్నుమూసిన విషయం ఆయన సోదరుడు అరుణ్ స్వయంగా ధ్రువీకరించారు. జబర్దస్త్ అభిమానులకు మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎన్నో స్కిట్ల ద్వారా అభిమానులను అలరించారు. కొన్నేళ్లుగా ‘ప్యాంక్రియాస్’ క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్న మూర్తి ఈ రోజు హన్మకొండలో మరణించారు.

క్యాన్సర్ కారణంగా రోజు రోజుకీ ఆరోగ్యం క్షీణించడం, రోజువారీగా వాడే మెడిసన్ కూడా సైడ్ ఎఫెక్ట్ చూపించడం మూర్తి మరణానికి కారణం అయ్యింది. ఈ మూడు సంవత్సరాలలోనే దాదాపు తన వైద్యం కోసం 16 లక్షలు ఖర్చు పెట్టారని కూడా సమాచారం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాణాలు నిలుపుకోలేక పోయారు. ఈయన మరణ వార్త తెలుసుకొని ఇండస్ట్రీలోని పలువురు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

































