నరేంద్ర మోదీ అసోం పర్యటనలో భాగంగా దిబ్రుగఢ్ జిల్లాలోని తేయాకు తోటను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికులతో కలిసి తేయాకు ఆకులు కోసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణ కార్మికుల మధ్యకు వెళ్లి వారితో మమేకం కావడం, సెల్ఫీలు దిగడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మోదీ రాకతో తేయాకు తోట ప్రాంతంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. స్థానిక గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి పని పరిస్థితులు, జీవన విధానం గురించి తెలుసుకున్నారు. పలువురు మహిళా కార్మికులు ప్రధాని వెంట సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా, మోదీ కూడా ఆప్యాయంగా స్పందించారు.
ఈ పర్యటనలో భాగంగా గోగముఖ్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. అసోంలో తమ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తూ, ఆయనకు మరోసారి ఓటమి తప్పదని ఎద్దేవా చేశారు.
అసోం అభివృద్ధిపై మాట్లాడుతూ, రాష్ట్రం గత కొన్నేళ్లలో గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధికి హిమంత బిశ్వ శర్మ నాయకత్వం కీలకమని కొనియాడారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ చేసిన సేవలను కూడా గుర్తు చేశారు.
ఇక రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలనే లక్ష్యాన్ని మరోసారి వెల్లడించిన మోదీ, ఆదివాసీ సముదాయాల హక్కులను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మోదీ ప్రజలతో దగ్గరగా మెలగడం, స్థానిక సంస్కృతిని ఆస్వాదించడం ప్రత్యేకంగా నిలిచింది.



























