పెద్దలు మనుషులు కోతుల నుంచి పుట్టారని చెబుతూ ఉంటారు. కొంచెం అల్లరి పనులు చేసినా కోతి ఛేష్టలు చేస్తున్నావని కామెంట్లు చేస్తూ ఉంటారు. నిజ జీవితంలో కోతులు కూడా మనుషుల చేతుల్లోని పళ్లను, కొబ్బరి చిప్పలను లాక్కుంటూ ఆట పట్టిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఒక కోతి మాత్రం విచిత్రంగా నూతన దంపతులను ఆశీర్వదించి వార్తల్లో నిలిచింది. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో చోటు చేసుకుంది.

పెళ్లికి అనుకోని అతిథి రావడంతో పెళ్లికి హాజరైన బంధువులు సైతం అవాక్కయ్యారు. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారి మాత్రమే పెళ్లి వేడుక జరుగుతుంది. కలకాలం పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని పెళ్లికి హాజరైన అతిథులు ఆశీర్వదిస్తూ ఉంటారు. అయితే ఈ పెళ్లిలో మాత్రం విచిత్రంగా కోతి వధూవరులకు ఆశీర్వాదం తెలపడంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే ములుగు జిల్లాలోని వాగేడు మండలం గుమ్మడి దొడ్డి గ్రామానికి భరత్ కు నాగలక్ష్మి అనే యువతికి మంగపేటలోని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో వివాహం జరిగింది. కరోనా ఆంక్షల కారణంగా పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. కరోనా వల్ల ఇప్పటికే రెండు సార్లు వీరి వివాహం వాయిదా పడగా చివరకు నిరాడంబరంగా వివాహం జరిపించాలని పెళ్లికొడుకు, పెళ్లికూతురు కుటుంబ సభ్యులు భావించారు.
20 మంది మాత్రమే వివాహానికి హాజరు కాగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక వానరం వధూవరుల తల పైకి ఎక్కి వారిని ఆశీర్వదించి అక్కడినుండి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు, బంధువులు వానరం ఆశీర్వదించడంతో ఆంజనేయ స్వామే పెళ్లి వేడుకకు కోతి రూపంలో వచ్చి ఆశీర్వదించాడని భావించారు. ఆలయ సన్నిధిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం ముందు కోతి వధూవరులను ఆశీర్వదించింది.































