దాదాపు పాతిక సంవత్సరాల క్రితం విడుదలైన శుభలగ్నం సినిమాలో హీరోయిన్ ఆమని తన భర్తను డబ్బుపై ఆశతో కోటి రూపాయలకు అమ్మేస్తుంది. నిజ జీవితంలో కూడా అలాంటి భార్యలు ఉంటారా..? భర్తను ప్రియురాలు డబ్బులిస్తే అమ్మేస్తారా…? అనే ప్రశ్నకు ఈ ఘటనను చూస్తే నిజమే అని సమాధానం వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో డబ్బు కోసం మహిళ భర్తను అమ్మేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తి ఆమె భార్యతో తరచూ గొడవ పడుతూ మరో మహిళతో సన్నిహితంగా ఉండేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య ప్రతిరోజూ గొడవలు జరిగేవి. రోజూ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటంతో పెద్ద కూతురు తన చదువుకు భంగం కలుగుతోందని భావించి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు బాలిక ఫిర్యాదును స్వీకరించి భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వగా భర్త తనకు భార్య కంటే ప్రియురాలే ముఖ్యమని తేల్చి చెప్పాడు.
తాను ప్రియురాలితోనే కలిసి ఉంటానని భార్యతో విడాకులు ఇప్పించాలని ఫ్యామిలీ కోర్టును కోరాడు. అయితే భర్త తీరు మారకపోవడంతో విసుగు చెందిన భార్య చివరకు ఒక షరతుపై విడాకులు ఇవ్వడానికి అంగీకరించింది. తనకు భర్త ప్రియురాలు కోటి రూపాయల 50 లక్షలు ఇస్తే తాను విడాకులు ఇస్తామని ఆ మహిళ తెలిపింది. ఆ డబ్బులు నేను నాకోసం అడగడం లేదని.. పిల్లల భవిష్యత్తు కోసమే ఆ డబ్బును ఖర్చు చేస్తానని మహిళ పేర్కొంది.
మొదట కోటిన్నర రూపాయలు ఇవ్వడానికి అంగీకరించని భర్త ప్రియురాలు చివరకు కోటీ 20 లక్షల రూపాయల విలువ చేసే ఫ్లాట్, 27 లక్షల రూపాయల క్యాష్ ఇవ్వడానికి అంగీకరించింది. దాదాపు కోటిన్నర రూపాయలకు డీల్ కుదుర్చుకుని భర్తను భార్య అమ్మేయడం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



























