Mr. Tea Naveen Reddy : రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన ఒక కిడ్నాప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా లెవెల్లో వందమందితో వచ్చి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన వారిని కొట్టి ఆ ఇంటివద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నానా హంగామా చేసి యువతిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. కానీ ఈ కిడ్నాప్ విషయంలో లోతుకి వెళితే అక్కడే మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇక కిడ్నాప్ చేయించిన నవీన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. దౌర్జన్యంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసారని తొలుత భావించినా నిజానికి ఆ అమ్మాయికి నవీన్ రెడ్డికి అంతకుముందు ప్రేమ వ్యవహారం ఉందంటూ ఆ అమ్మాయికి కాస్ట్లి కారు గిఫ్ట్ ఇచ్చాడు అంటూ బయట ప్రచారం జరుగుతోంది. ఇక వ్యాపారవేత్తగా చిన్న వయసులోనే సక్సెస్ అయిన నవీన్ రెడ్డి ఈ ఒక్క సంఘటనతో ఒక్కసారిగా తాను తెచ్చుకున్న మంచి పేరును చెడగొట్టుకున్నాడు. ఇక ఆయన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఆయన గురించి మాట్లాడారు.

ఆ అమ్మాయి నవీన్ రెడ్డి ఇంటికి వచ్చేది…
నవీన్ రెడ్డి వ్యాపారంలో అంచెలంచాలుగా ఎదిగి మంచి పేరు, డబ్బు సంపాదిస్తున్నాడు. ఇక అతని గురించి ఆయన ఇంటి వద్ద ఉన్న స్థానికులు మాట్లాడుతూ మొదట్లో ఇంటి నుండే ఆఫీస్ పనులు చూసుకునేవాడు, కష్టపడి ఇంత సక్సెస్ చూసాడు. కష్టపడి పైకి వచ్చిన నవీన్ ఆ అమ్మాయిని షటిల్ ఆడేందుకు వెళ్లిన సమయాల్లో పరిచయం అయి ఆది ప్రేమ వరకు వెళ్లిందంటూ చెబుతున్నారు.

ఇక వైశాలి నవీన్ రెడ్డి ఇంటికి గతంలో తరచూ వచ్చేదాంటూ కొంత మంది స్థానికులు చెప్పడం గమనార్హం. ఇదే విషయాన్ని నవీన్ తల్లి కూడా చెప్పారు. వైశాలి వచ్చేదని వైశాలి కుటుంబం కూడా పెళ్ళికి ఒప్పుకుని నిశ్చితార్థం చేయాలని మాట్లాడుకున్నాక ఇలా వాళ్ళు ఇంకో పెళ్లి సంబంధం ఆ పిల్లకు చూసారంటూ ఆరోపించారు. నవీన్ రెడ్డి మంచివాడే అయినా అలా ఒక అమ్మాయిని ఎత్తుకురావడం వాళ్ల ఇంట్లో వాళ్ళను గాయపరచడం ఇవన్నీ తప్పు. నిజాయితీగా ప్రేమించుంటే ఆ అమ్మాయిని వాళ్ల కుటుంబాన్ని ఒప్పించాలి కానీ ఇలా దౌర్జన్యం చేయకూడదు. ఇప్పుడు నవీన్ పరువు, ముఖ్యంగా ఆ అమ్మాయి పరువు రెండు పోయాయి అంటూ స్థానికులు అభిప్రాయపడ్డారు.



























