Natti Kumar : చిరంజీవి గారు, కొడుకు రామ్ చరణ్ తో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ ఒక పీడకల లాగా మారింది. సినిమా డిజాస్టర్ గా మిగలడమే కాకుండా చిరంజీవి గారి కొత్త సినిమాల విషయంలో ఆయన పంథాను మార్చింది. త్వరలో విడుదల కాబోతున్న ‘గాడ్ ఫాదర్’ సినిమా విషయంలో ఆయన మాట్లాడినతీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. థియేటర్ దేవాలయం, సినిమాను థియేటర్ లో చూడండి దయచేసి అంటూ చెప్పడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ విషయం మీద నిర్మాత నట్టికుమార్ మాట్లాడారు.

ఆ నిర్మాతల వల్లే అలా మాట్లాడారు…
ప్రొడ్యూసర్ నట్టి కుమార్ మాట్లాడుతూ చిరంజీవి గారు ఎవరికీ భయపడాల్సిన పని లేదు, అయినా భయపడటం లేదు కేవలం సినిమాను థియేటర్ లో చూద్దామని ప్రేక్షకులను కోరారు. అందులో నాకేమి తప్పు కనిపించడం లేదు. ఎవరైనా సరే ఏ హీరో సినిమా అయినా విడుదల అవుతోందంటే సినిమాను థియేటర్ లో చూడండి అని చెప్పడంలో తప్పేముంది. దిల్ రాజు వంటి కొందరు నిర్మాతలు సినిమాలను చూడటానికి జనాలు థియేటర్ కి రావడం లేదనే అపోహను ప్రచారం చేస్తున్నారు.

అందులో నిజం లేదు అది ఆల్రడీ బింబిసార, సీతారామం, కార్తికేయ నిరూపించాయి. ఇక రీ రిలీజ్ అయి జల్సా, పోకిరి, చెన్నకేశవరెడ్డి సినిమాలు కూడా నిరూపించాయి. సినిమాకు ఉండాల్సింది కంటెంట్ అది లేనపుడు ఎవరూ చూడరు. అది ఉంటే ఏ ప్రేక్షకుడైనా థియేటర్ వచ్చి చూస్తాడు. ఈ విషయమే ఎన్టీఆర్, బాలకృష్ణ, కూడా చెప్పారు అంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు.



































