“చంద్రముఖి” చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార నయనతార. ఆ తర్వాత “లక్ష్మి” చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన నటించి అగ్ర హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది. అతి తక్కువ కాలంలోనే బాస్, యోగి, తులసి, దుబాయ్ శీను తదితర చిత్రాలలో అగ్ర హీరోల సరసన ఈ మలయాళ భామ నటించి.. చూపరులను ఇట్టే ఆకర్షించగల తన అందంతో దక్షిణాది సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపుతోన్న నయనతారకు ఆమె కుటుంబం అంటే చాలా ఇష్టం.

ఎలాంటి కష్టమైనా తన కుటుంబ సభ్యులతోనే పంచుకుంటానని నయన తార చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. తన ఇమేజ్‌ను పాడు చేసేందుకు ఎందరో ప్రయత్నించారని, ఆ సమయంలో తన కుటుంబ సభ్యులే తనకు ఎంతో అండగా నిలిచారని, ఎన్ని కష్టాలు ఎదురైన తామున్నామని ప్రోత్సహించే కుటుంబ సభ్యుల సహకారంతోనే తానీస్థాయికి ఎదిగానని ఆ ఇంటర్వ్యూలోనే తెలియజేసింది. టాలీవుడ్ & కోలీవుడ్ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నయన తార, ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలిసి ఈమధ్యనే గోవా టూర్ వెళ్లిన సంగతి సోషల్ మీడియాలోని నెటిజన్లందరికీ తెలిసిందే.

గత నాలుగేళ్లుగా నిండా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ ప్రేమ జంట తమకున్న వ్యక్తిగత టెన్షన్‌లన్నిటినీ పక్కనపెట్టి ప్రశాంతంగా ఎంజాయ్ చేశారు. సెప్టెంబర్ 18న విఘ్నేష్ 35వ పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నారు. అయితే అంతకన్నా 3 రోజుల ముందు విఘ్నేష్ తల్లి పుట్టినరోజునూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ బర్త్ డే వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. అయితే అందాల తార నయన తార ప్రియుడి బర్త్ డే కోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. కోలీవుడ్ సినీ వర్గాల ప్రకారం ఈ ప్రేమ జంట 3 రోజులు పాటు గోవాలో ఉన్నందుకుగానూ నయన్ 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తాజా సమాచారం. గతంలో ‘నానుమ్ రౌడీదాన్’ చిత్రం షూటింగ్ టైం లో నయన్, విఘ్నేష్‌లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో విహార యాత్రలను ప్లాన్ చేస్తూ పనిలో పనిగా దేశ దేశాలను కూడా చుట్టివచ్చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నయనతార నటిస్తున్న “నెట్రికన్” అనే చిత్రాన్ని ఆమె బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ నిర్మిస్తున్నారు. అలాగే ఆయన దర్శకత్వం వహిస్తున్న “కాదువాక్కుల రెండు కాదల్” చిత్రంలో కూడా మన నయన తార హీరోయిన్‌గా నటిస్తుంది. ఏదేమైనా కేవలం 3 రోజుల విహార యాత్ర కోసం ఇంత భారీగా ఖర్చుపెట్టడం చాలా ఆశ్చర్యకరమైన విషయమని సినీరంగ ప్రముఖులు ముక్కున వేలేసుకుంటున్నారు.



























