దేశంలో గ్యాస్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఎల్పీజీ మరియు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వినియోగంపై కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మార్పులతో గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా విధానం మరింత నియంత్రితంగా మారనుంది.

తాజా నిబంధనల ప్రకారం, ఒకే వినియోగదారుడు ఎల్పీజీ లేదా పీఎన్‌జీ లో ఏదో ఒక కనెక్షన్ మాత్రమే కలిగి ఉండాల్సి ఉంటుంది. రెండింటిని ఒకేసారి ఉపయోగించడానికి ఇకపై అనుమతి ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే పీఎన్‌జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు ఆ కనెక్షన్‌కు మారాలని సూచనలు జారీ చేసింది.
పీఎన్‌జీ కనెక్షన్ తీసుకున్న తర్వాత ఎల్పీజీ కనెక్షన్‌ను సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను గ్యాస్ ఏజెన్సీలు నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాల్సిందిగా మార్గదర్శకాలు ఇచ్చారు. పీఎన్‌జీకి మారిన 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్‌ను నిలిపివేయాల్సి ఉంటుందని సమాచారం. ఈ విధానం ద్వారా గ్యాస్ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.
అయితే భవిష్యత్తులో పీఎన్‌జీ అందుబాటులో లేని ప్రాంతాలకు వినియోగదారులు మారినప్పుడు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక సౌలభ్యం కల్పించారు. అలాంటి సందర్భాల్లో మళ్లీ ఎల్పీజీ కనెక్షన్ పొందేందుకు రీప్లేస్‌మెంట్ వోచర్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీని ద్వారా వినియోగదారులకు కొంత ఊరట లభించనుంది.
మార్చి నెలలో ప్రకటించిన ఈ నిబంధనలకు అనుగుణంగా మూడు నెలల గడువు ఇచ్చారు. ఈ గడువు జూన్‌తో ముగియనుంది. దీంతో పీఎన్‌జీ ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు తప్పనిసరిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే జూన్ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.
హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు పీఎన్‌జీ కనెక్షన్లపై ప్రాధాన్యత ఇస్తున్న గ్యాస్ కంపెనీలు ఇప్పటికే విస్తరణ పనులు వేగవంతం చేశాయి. పెద్ద నగరాల్లో ఈ మార్పు వేగంగా జరుగుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో గ్యాస్ వినియోగ విధానం పూర్తిగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.



























