ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన చిన్న కోడలు, కన్నా చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.. హైదరాబాద్ సమీపంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న మీనాక్షి బాంబూస్‌లో గురువారం ఫ్రెండ్ ఇంట్లో పార్టీ చేసుకుంటుండగా సుహారిక ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దాంతో వెంటనే ఆమెను రాయదుర్గంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చిన్న కోడలు మరణించడంతో కన్నా కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మృతి విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కన్నా కొడుకు ఫణీంద్ర కుమార్ తన భార్య మరణంపై సందేహాలున్నట్లు మీడియాకి తెలియజేశారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ను ఈ కేసు దర్యాప్తు విషయంపై కలిశానని, ముందు తన భార్య సిబిఐటి వద్ద చనిపోయిందని చెప్పారని, ఆ తర్వాత ఏఐజి హాస్పిటల్ కి దగ్గరలో ఉన్న బ్యాంబో హిల్స్ చనిపోయిందని 2 మాటలు చెప్పినట్లు తెలియడంతో తన బార్య మృతి పట్ల కొన్ని సందేహాలున్నట్లు సజ్జనార్ గారికి తెలిపారు. ఈ సందర్భంగా ఫణీంద్ర ఆరోజు అక్కడ అస్సలు బర్త్ డే పార్టీ జరగలేదని చెప్పడం ఈ కేసులో క్రొత్త ట్విస్ట్. సుహారిక చనిపోయే నెల రోజుల ముందు తన తండ్రి చనిపోయాడని..

అప్పటి నుండి ఆస్తుల విషయంలో ఆ ఇంట్లో తన తోడల్లుడు గొడవ చేస్తున్నట్టు తెలిపారు. ఆస్తుల విషయం మాట్లాడుకోవడానికే బాంబో విల్లాస్ కి సుహారిక వెళ్ళిందని.. ఆ రోజు ఏం జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత లేదని, అక్కడున్న నలుగురులో ఇద్దరు మాత్రమే తనకు తెలిసిన వాళ్ళని.. అసలు నిజాలు బయటకు రావట్లేదని, పోలీసులు ఈ కేసుని అన్ని కోణాల్లోనుంచి విచారించి నిజాల్ని బయటికి తీసుకోస్తారని ఆశిస్తున్నట్లు కన్నా కొడుకు ఫణీంద్ర కుమార్ తెలియజేశారు.