సినిమా పేరు: ‘నిశ్శబ్ద ప్రేమ’
విడుదల తేదీ: మే 23, 2025
నటీనటులు: శ్రీరామ్, ప్రియాంక తిమ్మేష్, హరీశ్ పెరడి, వియాన్, నిహారిక పాత్రో మరియు ఇతరులు
డీవోపీ: యువరాజ్.ఎం
ఎడిటర్: మదన్.జి
సంగీతం: జుబిన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పరిటాల రాంబాబు
బ్యానర్: సెలెబ్రైట్ ప్రొడక్షన్స్
నిర్మాత: కార్తికేయన్.ఎస్
దర్శకత్వం: రాజ్ దేవ్

హలో పాఠకులారా! ఇప్పుడున్న ట్రెండ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలంటే అందరికీ పిచ్చి. ఓటీటీ పుణ్యమా అని భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూసేస్తున్నారు. అందులోనూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, ట్విస్టులతో నిండిన సినిమాలంటే యూత్ ఊగిపోతున్నారు. అలాంటి సినిమాలే థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తున్నాయి. అలాంటి ఒక ప్రయత్నమే ‘నిశ్శబ్ద ప్రేమ’. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు పెరిగిపోయాయి. ఇదివరకే తమిళ్లో హిట్ కొట్టిన ఈ సినిమా, మే 23న తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమాలో విషయం ఏంటి? ఇది ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం!
‘నిశ్శబ్ద ప్రేమ’ కథాంశం:
సినిమా మొదట్లోనే సంధ్య (ప్రియాంక తిమ్మేష్)ను ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తి ఇంట్లోనే చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆమె ఎలాగోలా తప్పించుకుని పరిగెడుతుండగా ఒక యాక్సిడెంట్ అవుతుంది. రఘు అనే వ్యక్తి ఆమెను హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. తలకు దెబ్బ తగలడంతో సంధ్య తన గతం మర్చిపోతుంది. రఘు తన భర్త అని చెప్పి ఆమెను ఇంటికి తీసుకువెళ్లి బాగా చూసుకుంటాడు. ఒకరోజు పాత డైరీ చూసిన సంధ్యకు అతను రఘు కాదని, విఘ్నేష్ (శ్రీరామ్) అని తెలుస్తుంది. ఇంతలో తన భార్య కనిపించడం లేదని రఘు (వియాన్) పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. కమీషనర్ అడ్వర్డ్ (హరీశ్ పెరడి) విచారణ మొదలుపెడతాడు. అసలు సంధ్యను విఘ్నేష్ ఎందుకు తన ఇంటికి తీసుకువెళ్ళాడు? సంధ్య ఎలా తప్పించుకుంది? విఘ్నేష్ ఎవరు? రఘు ఎవరు? వీళ్ళిద్దరికీ సంధ్యకు ఉన్న సంబంధం ఏమిటి? రఘు పర్సనల్ సెక్రటరీ షీలా (నిహారిక పాత్రో) పాత్ర ఏమిటి? సంధ్యను చంపాలనుకున్నది ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల పనితీరు:
విఘ్నేష్ పాత్రలో శ్రీరామ్ అద్భుతంగా నటించాడు. సీరియస్ లుక్స్‌తో క్రూరంగా హత్యలు చేసే పాత్రలో జీవించేశాడు. తన అనుభవాన్ని మొత్తం రంగరించి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సంధ్యగా ప్రియాంక తిమ్మేష్ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకుని నడిపించింది. షీలాగా నిహారిక పాత్రో గ్లామర్‌తో యూత్‌ను ఆకట్టుకుంటుంది. రఘుగా వియాన్ కండలు తిరిగిన శరీరంతో కనిపించాడు. హరీశ్ పెరడి కూడా తన పాత్రలో చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జుబిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ కూడా చాలా నీట్‌గా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. దర్శకుడు కథను పక్కదారి పట్టించకుండా చక్కగా తెరకెక్కించాడు.
విశ్లేషణ:
దర్శకుడు సినిమాలోని పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకోకుండా డైరెక్ట్‌గా కథలోకి వెళ్ళిపోయాడు. సినిమాలో పాటలు కూడా తక్కువే. ఒక థ్రిల్లర్ సినిమాకు కావాల్సినంత మేరకే పాటలు పెట్టాడు. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ట్యాగ్‌లైన్: అసలైన ప్రేమకు సిసలైన నిర్వచనం
రేటింగ్: 3/5



























