విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు తెలియని సినీ ప్రేమికుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆయనకి మాస్ ఇమేజ్ తీసుకు వచ్చిన పాతాళ భైరవి అద్భుత విజయాన్ని సాధించింది. 1951 విజయ ప్రొడక్షన్స్ లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాళ భైరవి సినిమాకి పింగళి నాగేంద్రరావు రచనా సహకారాన్ని అందించారు. అద్భుతమైన పాత్రల రూపకల్పన ఆ పాత్రలు శారీరక భాష, ఉత పదాలు, విశేషణ పదాలు రాయడంలో దిట్ట రచయిత పింగళి నాగేంద్రరావు.

అలా ఆ సినిమాలో తోటరాముడు పాత్ర ఆ తర్వాతి దాదాపు 15 సినిమాలకు ప్రేరణ అవుతుందని ఆనాడు పింగళి గారు ఆలోచించ లేకపోయారు. ఆ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించడంతో ఎన్టీ రామారావుకి ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అలా 1954 మొదలుకొని ఎన్టీరామారావు గారివి రాముడు అనే టైటిల్ తో పదిహేను సినిమాలు వచ్చాయి. అవి అగ్గి రాముడు, పిడుగు రాముడు, శభాష్ రాముడు, టాక్సీరాముడు, బండరాముడు, దొంగ రాముడు, టైగర్ రాముడు ఇలా 7 చిత్రాలు వచ్చిన తర్వాత ఎనిమిదో చిత్రంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అడవి రాముడు 1977 లో విడుదలై కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన విజయాన్ని సాధించింది.

ఈ సినిమా తర్వాత రాముడు పేరు తో నటించిన ఎన్టీ రామారావు చిత్రాలు మరో ఏడు విడుదలవడం ఓ విశేషం. అవి డ్రైవర్ రాముడు, ఛాలెంజ్ రాముడు, శృంగార రాముడు, కలియుగ రాముడు, సరదా రాముడు, సర్కస్ రాముడు, రాముని మించిన రాముడు… అయితే ఈ 15 చిత్రాల్లో అడవి రాముడు మధ్యస్తంగా ఉండడం ఒక విశేషం. ఇలాంటి కామన్ టైటిల్ తో 15 చిత్రాలు చేయడం ఓ రికార్డు. కామన్ టైటిల్ తో మరో హీరో ఇలాంటి సినిమాలు చేయలేదని చెప్పవచ్చు.

































