ప్రస్తుతం కరోనా రెండవ దశ భారతదేశంలో తీవ్రరూపం దాలుస్తోంది. ఈ మహమ్మారి బారిన పడకుండా ప్రజలందరూ వ్యాక్సిన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే మన దేశంలో వ్యాక్సిన్ డిమాండ్ అధికంగా ఉండటం వల్ల వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. మనదేశంలో వ్యాక్సిన్ కావాలంటూ ప్రజలందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉండగా మరికొన్ని దేశాలలో మాత్రం వాక్సిన్ వేయించుకొమ్మని అధికారులు ప్రజలను బతిమాలుతున్నారు.

ఇతర దేశాలలో వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం ప్రజలలో అవగాహన కల్పించాలని వివిధ దేశాల ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కోసం ఎన్నో బహుమతులను ప్రకటించాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే విలువైన బహుమతులను సొంతం చేసుకోవచ్చని చెబుతూ ప్రజలను వ్యాక్సినేషన్ కేంద్రాలకు రప్పించుకుంటున్నారు.
తాజాగా ఒహియోలో ఏకంగా లాటరీ పెట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ మైక్ డివైన్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ప్రక్రియను ప్రోత్సహించడం కోసం లాటరీ విధానాన్ని పెట్టడమే కాకుండా విద్యార్థులకు సైతం ప్రోత్సాహలను అందిస్తామని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారందరు లాటరీ విధానం ద్వారా ఒక మిలియన్ డాలర్లను సొంతం చేసుకోవచ్చని మైక్ తెలిపారు.
ఒహియోలో కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే లాటరీ విధానం ద్వారా మన భారత కరెన్సీ ప్రకారం7.34 కోట్ల రూపాయలను సొంతం చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఒహియో గవర్నర్ తెలిపారు. ఇంత మంచి అవకాశాన్ని ఎవరు వదులుకోకూడదని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకొని ఈ లాటరీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం ఈ దేశంలో కరోనా తీవ్రత కొంత వరకు తగ్గుముఖం పట్టడంతో జూన్ 2 నుంచి షరతులతో కూడిన లాక్ డౌన్ సడలింపులు ఉంటాయని తెలిపారు.



























