మహిళలకు ప్రవేశం లేని ఆలయమిదే.. దేవునికి మగవాళ్ల పొంగళ్లు..?

0
154

సాధారణంగా ఏ ఆలయానికైనా స్త్రీ పురుషులు వెళ్లే అవకాశం ఉంటుంది. సంక్రాంతి పండగ సమయంలో ఏ ఆలయంలోనైనా ఆడవాళ్లు పొంగళ్లు పెడతారు. అయితే ఒక ఆలయంలో మాత్రం మగవాళ్లే పొంగళ్లు పెడతారు. కడప జిల్లాలోని పుల్లంపేటలో ఉన్న తిప్పాయపల్లె సంజీవరాయ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం రోజున ఆలయాల్లో మగవాళ్లు పొంగళ్లు పెడతారు.ఈ ఆలయంలో మగవాళ్లే ప్రసాదం చేయడంతో పాటు ఆ ప్రసాదాన్ని కూడా కేవలం మగవాళ్లు మాత్రమే తింటారు. మహిళలు ఆలయంలోకి రాకుండా ఆలయం బయటినుంచే స్వామిని దర్శించుకుని వెళ్లిపోతారు. సంక్రాంతి ముందు ఆదివారం రోజున ఈ విధంగా సంవత్సరాల తరబడి ఆచారం కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నా పండుగ ముందు ఆదివారం రోజు గ్రామానికి చేరుకుని ఉద్యోగులు, వ్యాపారులు పొంగళ్లు వండుతారు.

రాతిశిలపై ఉన్న లిపినే ఇక్కడి గ్రామస్తులు సంజీవరాయుడిగా కొలుస్తారు. పొంగలి చేయడానికి కావాల్సిన సామాగ్రిని తెచ్చుకుని సంజీవరాయుని దగ్గర పొంగళ్లను పెట్టుకుంటారు. తిప్పాయపల్లె గ్రామంలో చాలా సంవత్సరాల క్రితం పంటలు పండేవి కావు. గ్రామ ప్రజలు కరువు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఒక బ్రాహ్మణుడు రాయిపై లిపితో రాసి సంజీవరాయుని విగ్రహాన్ని ప్రతిష్టించాడు.

ఆ విగ్రహాన్ని ప్రతిష్టించిన అనంతరం గ్రామంలో పొంగళ్ల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నారు. విగ్రహం ప్రతిష్టించినప్పటి గ్రామం సుభిక్షంగా ఉండటంతో పాటు పంటలు బాగా పండుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దేవునికి గ్రామస్తులు కొబ్బరి, బెల్లం కానుకలుగా సమర్పిస్తారు.