“పరుచూరి పలుకులు” ద్వారా తన యూట్యూబ్ ఛానల్లో తెలుగు చలన చిత్రసీమకి సంబంధించిన ప్రముఖుల గురించి, అలాగే టాలీవుడ్ లో తెర వెనుక జరిగే కథలను గురించి ఫ్యాన్స్ కు వివరించే పరుచూరి గోపాలకృష్ణ ఈసారి ప్రముఖ సీనియర్ నటుడు, అలనాటి హీరో చంద్రమోహన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒక వీడియో రూపంలో తెలియజేశారు.

చంద్రమోహన్‌ది పమిడి ముక్కల గ్రామం. మాది మేడూరు. ఇద్దరివీ ప్రక్క ప్రక్క ఊర్లే.. అలాగే
చంద్రమోహన్ మా అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావు క్లాస్ మేట్. బెంచ్ మేట్ కూడా.! మా అక్క కూడా అక్కడే చదివారు. నాతో పెద్దగా పరిచయం లేకపోయినా అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్తుండేవారు చంద్రమోహన్. బాగా చదివుకున్నారని మా అన్నయ్యకి మంచి పేరు ఉండేది. ఆ రోజుల్లో ఆయన చేతివ్రాతకి కూడా నూటికి నూరు మార్కులు పడేవి. ఇదిలావుండగా మాకన్నా ముందుగానే చంద్రమోహన్ సినిమాల్లోకి వచ్చారు. చంద్రమోహన్ నటించిన “రంగుల రాట్నం” సినిమా చాలా సార్లు చూశాం. మా ఊరివాడు, పొట్టివాడైనా చాలా గట్టివాడు అని తెగ సంబర పడిపోయాము. సిరి సిరి మువ్వ, శంకరాభరణం సినిమాలు చూస్తే.. అతను ఆ పాత్రలలో ఉన్నాడా.. లేక ఆ పాత్రలే అతనిలోకి వెళ్లిపోయాయా.? అనేంత అద్భుతంగా ఆ పాత్రలను పండించాడు. చాలా కొద్ది మంది సహజ నటుల్లో చంద్రమోహన్ ఒకరు.

అలాగే టాలీవుడ్ లో చాలా మంది చంద్రమోహన్‌ని పిసినారి అని అంటూ వుంటారు. కానీ ఆ మాటకి నేను ఒప్పుకోను. మారుతున్న కాలానుగుణంగా ఆమాత్రం జాగ్రత్త వుండాలి. అందుకే అతను జాగ్రత్త పరుడు అంటాను. మనకి ఒక రూపాయి వస్తే.. ఆ రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలో.. అందులో ఎంత దాచుకోవాలో బాగా తెలిసిన ఆర్ధిక నిపుణుడు చంద్రమోహన్. ఒకవిధంగా చెప్పాలంటే.. టాలీవుడ్ లో శోభన్ బాబు, మోహన్ బాబు, శ్రీధర్, చంద్ర మోహన్ ఈ నలుగుర్నీ ఆదర్శంగా తీసుకుంటే ఎవరి ఆస్తులు వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్లు నిజంగా గొప్పవాళ్లే. ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా దాచారు. దాన్నే నేటితరం పిసినారి తనం అంటున్నారు. చంద్ర మోహన్ తాను జాగ్రత్తగా ఉండటమే కాకుండా.. తన భార్యాపిల్లలను కూడా చక్కగా తీర్చిదిద్దారు. చంద్ర మోహన్‌తో త్వరలోనే ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. కథ కూడా సిద్ధం చేసేశాం. చంద్రమోహన్ ఎప్పటికీ ఇలాగే బాగుండాలి.. ఆయన్ని చూసి చాలా మంది చాలా విషయాలు నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ “పరుచూరి పలుకులు” కార్యక్రమానికి ముగింపు పలికారు టాలీవుడ్ రచయిత, నటుడు
పరుచూరి గోపాలకృష్ణ.



























